
కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లిలోని ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ రాజర్షి షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందుబాటులో లేని డాక్టర్లు, సిబ్బంది ఎందుకన్నారు. బుధవారం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడటంతోపాటు, రిజిస్టర్లు పరిశీలించారు. ఒకే సెలవు పత్రం రాసి సంతకం చేయకుండానే ఇష్టం వచ్చినన్ని రోజులు సెలవుగా ప్రకటించుకుంటూ అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కొత్తగా ఏడుగురు నర్సులు వచ్చినా.. ఆసుపత్రిలో మాత్రం రోగులకు వైద్యం అందడం లేదన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో సేవలందక, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే డాక్టర్, సిబ్బంది ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.