
గద్వాల, వెలుగు: భూభారతి చట్టం అమలుకు ఇటిక్యాల మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేసినందున తహసీల్దార్లు సిద్ధంగా ఉండి భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో భూభారతి చట్టం,రెవెన్యూ సదస్సు పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 5న గోపాల్ దిన్నె, 6న వావిలాల, 7న పెద్ద దిన్నె, 8న సత్తర్ల, 9న ఎం.ఆర్. చెరువు,12న షాదాబ్, 13న ఇటిక్యాల, 14న చాగాపురం, 15న మునగాల, 16న ఉదండాపురం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
గ్రామాల వారీగా సర్వే వివరాల జాబితాను తయారుచేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. సమస్యల కేటగిరీల ఆధారంగా పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పదో తరగతిలో 566 మార్కులు సాధించిన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అక్షయను కలెక్టర్ సంతోష్ అభినందించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ నారాయణ, తహసీల్దార్లు వీర భద్రప్ప, నరేశ్, డీటీ నందిని పాల్గొన్నారు.