- స్వగ్రామంలో నూతన గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం
- 5 వేల మందికి భోజనాలు
అచ్చంపేట, వెలుగు: ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న దంపతులు సోమవారం తమ స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మన్‌పేట గ్రామంలో సందడి చేశారు. ఇటీవల రాజస్థాన్‌లో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట, సోమవారం విజయ్ దేవరకొండ సొంతూరు తుమ్మన్‌పేటలో నూతన గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు గ్రామానికి చేరుకున్న దంపతులకు గ్రామస్తులు కోలాటాలు, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది విఐపీలు, కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక పాసులు జారీ చేసి వారినే లోపలికి అనుమతించారు.
అభిమానులు, గ్రామస్తుల కోసం ఇంటి సమీపంలో టెంట్లు వేసి 5 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఇంటి వద్ద జరుగుతున్న కార్యక్రమాలను వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9, 10 తరగతిలో ఫస్ట్ వచ్చిన వారికి రూ.10 వేలు, సెకండ్ వచ్చిన వారికి రూ.5 వేల బహుమతి అందజేయనున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు. సత్యనారాయణ స్వామి పూజలో విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి, రష్మిక తల్లిదండ్రులు మదన్ మందన్న, సుమన్ మందన్న, సోదరి సీమన్ మందన్నతో పాటు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రాములు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్, తెలంగాణ ప్రవాస భారతి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
