పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలి : కలెక్టర్ శరత్

పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలి : కలెక్టర్ శరత్
  • ఎలక్షన్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి  పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ కోరారు. శనివారం కలెక్టరేట్​లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజున  పొలిటికల్ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. మతపరమైన ప్రదేశాల్లో, విద్యాసంస్థలు, హాస్పిటల్స్​కు అనుకొని ఉన్న చోట ఎన్నికల బూత్ ఏర్పాటు చేయరాదన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ఓటర్లను అడ్డగించి ఎలాంటి ప్రలోభాలకు లోను చేయకూడదన్నారు.

పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నియమించిన పరిశీలకులు, పోలీస్​ అధికారులు మినహాయించి ఇతరులు పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లద్దన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.  అధికారులు ఎన్నికల విధుల పట్ల అలర్ట్​గా ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ మాధురి, డిఆర్ఓ నగేశ్, ఎన్నికల విభాగపు అధికారి దశరథ్ పాల్గొన్నారు.

సీ-విజిల్ యాప్​ ద్వారా ఫిర్యాదు చేయాలి

సిద్దిపేట టౌన్, వెలుగు: ఎలక్షన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే  సీ -విజిల్ యాప్​ ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సూచించారు. శనివారం కలెక్టరేట్​లో మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, మనీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే యాప్​ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజలు భాగస్వామ్యం అందించాలన్నారు. యువత సీ విజిల్ యాప్ ను డౌన్​లోడ్​ చేసుకుని మద్యం, నగదు పంపిణీ, ఓటర్లను బెదిరించడం వంటి వాటిని రికార్డ్​ చేసి సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కలెక్టర్​ సూచించారు. 100 నిమిషాల్లో ఎన్నికల అధికారులు స్పందించి యాక్షన్ తీసుకుంటారని తెలిపారు.c