లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తే చర్యలు : కలెక్టర్ వెంకట్​రావు

లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తే చర్యలు : కలెక్టర్ వెంకట్​రావు

సూర్యాపేట, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకట్​రావు హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్​లో లింగనిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ లింగనిర్ధారణ నిషేధ చట్టంపై  అధికారులు విస్తృతంగా జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారులే కాకుండా ఆర్డీవోలు కూడా జిల్లాలో నిర్వహిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలన్నారు.

జిల్లా విద్యాధికారుల సహకారంతో పాఠశాలలు, కళాశాలలు, వైద్య కళాశాలు, కేజీబీవీ పాఠశాలల్లో లింగనిర్ధారణ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సహకారంతో గ్రామాల్లో ఆర్ఎంపీలకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది బాలురకు 907 మంది బాలికలు మాత్రమే ఉన్నారని

ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆడపిల్లలని కనాలని, చదివించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీ‌‌‌‌ఎం‌‌‌‌హెచ్‌‌‌‌వో డాక్టర్ కోట చలం, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్ పర్సన్ కోటేశ్వరి,  ఆర్డీవోలు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మధుసూదనాచారి,  జిల్లా అటవీ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.