ఇకపై రోజూ గ్రీవెన్స్ .. కొత్త విధానానికి ఆసిఫాబాద్ కలెక్టర్ ధోత్రే శ్రీకారం

ఇకపై రోజూ గ్రీవెన్స్ .. కొత్త విధానానికి ఆసిఫాబాద్ కలెక్టర్ ధోత్రే శ్రీకారం
  • కలెక్టరేట్​లో గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
  • ప్రతిరోజూ ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
  • ‘ప్రతిదినం ప్రజల కోసం కలెక్టర్, గ్రీవెన్స్’ పేరుతో ఏర్పాట్లు
  • రాష్ట్రంలోనే మొదటిసారిగా..

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఒక్కరోజే కాకుండా ప్రతి రోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వెనువెంటనే పరిష్కరించేలా ప్రణాళిక వేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం కలెక్టరేట్​లో గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫిర్యాదులు భారీగా వస్తుండడం, ఒక్కరోజే ప్రజలు వచ్చి ఇబ్బందులు పడకుండా పరిష్కారం చూపారు. 

ప్రతిరోజూ ప్రజల నుంచి ఫిర్యాదులు  స్వీకరించేందుకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కలెక్టరేట్​లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్​ఏర్పాటు చేశారు. నలుగురు సిబ్బందిని నియమించి మంగళవారం నుంచి ఫిర్యాదులు తీసుకోవడం ప్రారంభించారు. జిల్లా ప్రజలకు మరింత చేరువై సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 

సమస్యలు అధిగమించి సత్వర పరిష్కారానికి కృషి

పలు సమస్యలతో ఇబ్బంది పడే ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్ కు వచ్చి అర్జీలు పెట్టుకుంటుంటారు. వారానికి ఒక్కసారి నిర్వహించే ప్రజావాణికి ఒకేసారి వందల సంఖ్యలో రావడం, ఇక్కడ ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సమస్యలకు సత్వర పరిష్కారం పొందలేని పరిస్థితి ఉంది. పర్యటనలు, ఇతర డ్యూటీల కారణంగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, అధికారులు కొన్ని సందర్భాల్లో ప్రజావాణిలో అందుబాటులో ఉండకపోవడంతో.. వారికి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చే ప్రజలు అసంతృప్తికి లోనవుతున్నారు. వీటన్నింటికి ముగింపు పలికేందుకు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ‘ప్రతిదినం ప్రజల కోసం కలెక్టర్, గ్రీవెన్స్’ పేరిట కార్యక్రమం చేపట్టారు. సోమవారం ప్రజావాణిని యథావిధిగా కొనసాగించనున్నారు.

పారదర్శకత పెంచేందుకు..

ప్రజలు ఏరోజైనా కలెక్టరేట్​కు వచ్చి దరఖాస్తు నేరుగా గ్రీవెన్స్​కంట్రోల్​రూమ్​లో సమర్పించవచ్చు. కలెక్టర్ అందుబాటులో ఉంటే ఆయన స్వయంగా ఎండార్స్ చేసి గ్రీవెన్స్​కు పంపిస్తారు. ఆయన లేకపోతే అక్కడున్న ఆఫీస్ సిబ్బంది, అధికారులు కలెక్టర్ నోటీస్ లో పెట్టి వెంటనే వాటిని గ్రీవెన్స్ సెక్షన్​కు పంపించి అక్కడ నుంచి సంబంధిత శాఖకు బదిలీ చేస్తారు. నిర్ణీత కాలంలో సమస్య పరిష్కరించి, వివరాలు ఆన్ లైన్​లో నమోదు చేయనున్నారు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా ప్రజల్లో ప్రభుత్వం, అధికారుల పట్ల మరింత నమ్మకం, గౌరవం ఏర్పడనుంది. మంగళవారం తొలి రోజు రెండు దరఖాస్తులు రాగా.. వాటిని స్వయంగా కలెక్టర్ వెంకటేశ్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకెశ్వర్ రావు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించి అర్జీదారులకు రసీదు అందించారు.

సుపరిపాలనే లక్ష్యం

జిల్లా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యం. మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు ఎంతో నమ్మకంతో కలెక్టరేట్​కు సోమవారం వచ్చి దరఖాస్తులు చేస్తుంటారు. సమయ భావం కారణంగా అందరి సమస్యలు, దరఖాస్తులు స్వీకరించడం లేట్ అవుతోంది. అందుకే ప్రత్యేకంగా కంట్రోల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. ఇక కేవలం సోమవారం మాత్రమే కాకుండా ఎప్పుడైనా ప్రజలు దరఖాస్తులు అందజేయవచ్చు. సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

 వెంకటేశ్ ధోత్రే, కలెక్టర్, ఆసిఫాబాద్