వడ్ల కొనుగోళ్లపై కదిలిన కలెక్టర్లు... కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై ఆరా

వడ్ల కొనుగోళ్లపై కదిలిన కలెక్టర్లు... కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై ఆరా
  • గోడౌన్లు, మిల్లుల్లో అన్‌‌‌‌లోడింగ్‌‌‌‌ పరిశీలన
  • బార్దాన్‌‌‌‌, హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు
  • సీఎం రేవంత్​రెడ్డి రివ్యూతో ఫీల్డ్​లో పర్యవేక్షణ

హైదరాబాద్/నెట్‌‌వర్క్‌‌, వెలుగు : రాష్ట్రంలో వడ్లు, మక్కల కొనుగోళ్ల పరిశీలనకు కలెక్టర్లు ఫీల్డ్‌‌లోకి కదిలారు. సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాలతో బుధవారం అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. బార్దాన్లు, హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. గోడౌన్లు, రైస్‌‌మిల్లుల్లో అన్‌‌లోడింగ్‌‌ జరుగుతున్న తీరును పరిశీలించారు. 

జిల్లా రవాణా అధికారులు, రెవెన్యూ ఆఫీసర్లను రంగంలోకి దించారు. రైస్‌‌మిల్లులు, మక్కల గోడౌన్ల వద్ద హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. తరుగు పేరిట కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్‌‌ మిల్లర్లను హెచ్చరించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు.

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌‌తో...

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి మంగళవారం వడ్లు, మక్కల కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. మిషన్‌‌ మోడ్‌‌లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని.. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. దీంతో బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు వడ్లు, మక్కల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. వడ్లు, మక్కల  కొనుగోళ్లలో తలెత్తిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 

సెంటర్లకు వచ్చిన వడ్లు, మక్కల వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని ధాన్యం బస్తాలను రైస్‌‌ మిల్లులకు, గోడౌన్లకు పంపించారో.. వాహనాల్లో సరుకు ఎందుకు దింపుకోవడం లేదో తెలుసుకున్నారు. అకాల వర్షాలు వస్తే వడ్లు, మక్కలు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా ? బార్దాన్ల పరిస్థితి ఏంటి ? అన్న వివరాలను కలెక్టర్లు సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్‌‌ చేశారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందికి గురిచేస్తే క్రిమినల్‌‌ చర్యలు తీసుకుంటామని రైస్‌‌ మిల్లర్లను హెచ్చరించారు. 

హమాలీల కొరత ఉన్న చోట వెంటనే లోకల్‌‌ వాళ్లను పిలిచి పనిలో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ శాఖ ఆఫీసర్లు, ఏఈవోలు ఈ సీజన్‌‌ పూర్తయ్యే దాకా కొనుగోలు కేంద్రాల బాధ్యతలను తీసుకోవాలని కలెక్టర్లు సూచించారు. ప్రతీ కొనుగోలు సెంటర్, రైస్‌‌ మిల్‌‌ వద్ద ఒక అధికారిని నియమించేలా ఉత్తర్వులు జారీ చేశారు. లారీల కొరతను అధిగమించేందుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట పోలీస్​ శాఖ హెల్ప్‌‌ తీసుకోవాలని ఆదేశించారు.

ఐకేపీ వీవోఏలు సస్పెన్షన్‌‌

గద్వాల, వెలుగు : గద్వాల మండలం తెలుగోనిపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌‌ రిజ్వాన్‌‌ బాషా షేక్‌‌ తనిఖీ చేశారు. కేంద్రంలో ఇన్‌‌చార్జి, మహిళా సంఘాల సభ్యులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐకేపీ వీవోఏ అలివేలు, రంగన్నను సస్పెండ్ చేయడంతో పాటు ఏపీఎం దేవానందంకు మెమో జారీ చేశారు.