కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
  •  ప్రభుత్వ సేవలను మానిటర్ చేయాలి
  • ఆదేశాలు జారీ చేసిన సీఎస్   

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వ సేవలను మానిటర్ చేయాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆదేశించారు. ప్రతి నెల 5వ తేదీలోపు సీఎస్ కార్యాలయానికి నెలవారీ టూర్ డైరీని సమర్పించాలంటూ శుక్రవారం ఈ మేరకు మెమో జారీ చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల ఇంకా అర్హుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల పనితీరును పరిశీలించి వైద్య సిబ్బంది, అవసరమైన మందులు, తగిన మౌలిక సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. పాఠశాలల పరిస్థితి, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మానిటర్ చేయాలన్నారు. రెసిడెన్షియల్ హాస్టళ్లను కూడా సందర్శించాలని సీఎస్ స్పష్టం చేశారు. 

విత్తనాలు, ఎరువులు, పంటల స్థితిని క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రభుత్వ పథకాల కింద అందించే ఇండ్ల పురోగతి, రోడ్లు, ప్రజా రవాణా ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా సమీక్షించాలని ఆదేశించారు.