పాస్‌‌ బుక్కుల్లో ఎమ్మార్వోల డిజిటల్ సైన్ కలెక్టర్లే చేస్తున్నరు

 పాస్‌‌ బుక్కుల్లో ఎమ్మార్వోల డిజిటల్ సైన్ కలెక్టర్లే చేస్తున్నరు
  • అక్రమాలు జరిగితే తాము బాధ్యులమవుతామని ఎమ్మార్వోల ఆందోళన
  • ఈ విధానాన్ని సవరించాలని విజ్ఞప్తి
  • అక్రమాలు జరిగితే తాము బాధ్యులమవుతామని ఎమ్మార్వోల ఆందోళన
  • ఈ విధానాన్ని సవరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తహసీల్దార్ల ప్రమేయం లేకుండానే ధరణి పోర్టల్‌‌లో సవరణలు జరిగిపోతున్నాయి. కలెక్టర్లు భూ రికార్డుల్లో సవరణలు చేస్తే.. పాస్ బుక్కుల్లో మాత్రం తహసీల్దార్ల డిజిటల్ సంతకంతో జారీ అవుతున్నాయి. కలెక్టర్ల స్థాయిలో ఏవైనా పొరపాట్లు జరిగినా, అక్రమాలు జరిగినా తాము బాధ్యులవుతామని ఎమ్మార్వోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ధరణి పోర్టల్ తీసుకొచ్చాక భూ రికార్డుల నిర్వహణ, అందులో తప్పొప్పుల సవరణకు సంబంధించిన సర్వాధికారాలు కలెక్టర్లకే అప్పగించింది. దీంతో తహసీల్దార్ల అధికారాల పరిధి చాలా తగ్గింది. కేవలం ధరణిలో ఎలాంటి వివాదాలు లేని భూములను రిజిస్ట్రేషన్లు చేయడం, కోర్టు కేసులను అనుసరించి పాస్‌‌ బుక్స్ జారీ చేయడం, సక్సేషన్ వితవుట్ పీపీబీ అధికారాలు మాత్రమే వారికి ఉన్నాయి. ఇవిగాక వివిధ కారణాలతో ధరణిలో డిజిటల్ సైన్ (డీఎస్)​ పెండింగ్‌‌లో ఉన్న భూములకు పాస్‌‌ బుక్స్‌‌ జారీ చేయాలన్నా, భూమి స్వభావాన్ని మార్చాలన్నా, మిస్సింగ్ సర్వే నంబర్‌‌‌‌ను రికార్డుల్లో ​చేర్చాలన్నా, నోషనల్‌‌ ఖాతాను వ్యక్తిగత ఖాతాగా మార్చాలన్నా, పేరు, భూమి విస్తీర్ణంలో తప్పులను సవరించాలన్నా, పెండింగ్ మ్యుటేషన్ క్లియర్‌‌‌‌ చేయాలన్నా కలెక్టర్ అప్రూవ్ చేయాల్సిందే. ఇలాంటి సమస్యలతో మీ సేవ సెంటర్ల ద్వారా వచ్చే దరఖాస్తులను కలెక్టర్ నేరుగా అప్రూవ్ చేస్తే.. కొత్త పాస్ బుక్‌‌పై సంతకం మాత్రం తహసీల్దార్లది వస్తోంది.

తప్పులు జరిగితే తహసీల్దార్లు బాధ్యులయ్యే ప్రమాదం.. 

పట్టాదారు పాస్‌‌ బుక్కులు ఇష్యూయింగ్ అథారిటీ తహసీల్దార్ ఉండడం వల్ల తర్వాత ఏదైనా వివాదం తలెత్తితే తహసీల్దారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు కలెక్టర్లు తహసీల్దార్ల రికమండేషన్స్‌‌ను పట్టించుకోవడం లేదు. కొన్ని అప్లికేషన్లపై తహసీల్దార్లను గ్రౌండ్ రిపోర్ట్ అడగకుండానే అప్రూవ్ చేస్తున్నారు. అందుకే కనీసం అప్రూవ్డ్ అథారిటీ సైన్‌‌గా పాస్‌‌బుక్స్‌‌లో కలెక్టర్ల సంతకం ఉండేలా చూడాలి. లేదా కలెక్టర్ అప్రూవ్ చేశాక తహసీల్దార్లు క్రాస్ చేసుకుని డిజిటల్‌‌ సైన్ చేశాక పాస్‌‌ బుక్స్‌‌ జారీ అయ్యేలా మార్చాలి. 

- కె.గౌతమ్ కుమార్, ట్రెసా, 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి