ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ అర్బన్, వెలుగు: దళితబంధు పథకాన్ని ఉపయోగించుకుని దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్ సూచించారు. మంగళవారం జనగామ కలెక్టరేట్​లో కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, దళితబంధు రాష్ట్ర సలహాదారు లక్ష్మారెడ్డితో కలిసి రివ్యూ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. దళిత బంధు ద్వారా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 185 యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. జనగామ జిల్లా పాడి పరిశ్రమకు అనుకూలంగా ఉందని, లబ్ధిదారులు ఈ రంగంపై దృష్టిపెట్టాలన్నారు. నష్టం వచ్చే యూనిట్లను ఎట్టిపరిస్థితుల్లో ఎంపిక చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకన్న, డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి, డీఏవో వినోద్ కుమార్, పశుసంవర్ధక శాఖ ఏడీ మనోహర్ తదితరులున్నారు.

యూపీ నుంచి వచ్చి చోరీలు

వరంగల్​లో యువకుడి అరెస్ట్

హనుమకొండ, వెలుగు: ఉపాధి కోసం యూపీ నుంచి వరంగల్​కు వచ్చి, చోరీలు చేస్తున్న ఓ యువకుడిని వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.2.5లక్షల విలువైన బైక్, ల్యాప్ టాప్​ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి వివరాల ప్రకారం.. యూపీకి చెందిన షేక్​ఫయాజ్ కొద్దిరోజుల కింద జీవనోపాధి కోసం హైదరాబాద్​కు వచ్చాడు. ఓ వాట్సాప్​ గ్రూప్​ ద్వారా హనుమకొండలోని ఓ హోటల్​నిర్వాహకుడితో పరిచయం కాగా.. అందులో పని చేసేందుకు గత నెల 23న వరంగల్ నగరానికి వచ్చాడు. యజమాని సూచన మేరకు హోటల్​ లో పని చేసే మరో ఇద్దరితో  కలిసి హనుమకొండ బస్టాండ్ సమీపంలో అద్దె గదిలో ఉంటున్నాడు. తోటి వర్కర్ల వద్ద  ఖరీదైన బైక్, ల్యాప్ టాప్ ఉండటాన్ని గమనించిన ఫయాజ్, అదే రోజు రాత్రి వాటితో ఉడాయించాడు. ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేయగా..  మంగళవారం ఉదయం సీసీఎస్​ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీ  పుష్పారెడ్డి, క్రైమ్స్ ఏసీపీ డేవిడ్​ రాజు, సీసీఎస్ సీఐలు రమేశ్​ కుమార్​,  శ్రీనివాస్ రావు, హనుమకొండ సీఐ శ్రీనివాస్ జీ, ఏఏవో సల్మాన్ పాషా ఇతర సిబ్బందిని సీపీ డా.తరుణ్​ జోషి అభినందించారు.

టీఆర్ఎస్ లీడర్ల సంబురాలు

మహబూబాబాద్​అర్బన్, వెలుగు: టీఆర్ఎస్ నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావు  ఎమ్మెల్సీగా  బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ లీడర్లు మహబూబాబాద్ పట్టణంలో సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేశారు. రవీందర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మరింత బలపడుతోందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ లీడర్లు మంగళంపల్లి కన్న, జేరిపోతుల వెంకన్న, కౌన్సిలర్ ఎడ్ల వేణు యాదవ్, భూక్య హరినాయక్, లీడర్లు కొండపల్లి కరుణాకర్ రెడ్డి, మాదరబోయిన యాకయ్య, పుచ్చకాయల రామకృష్ణ, రవీంద్రచారి, మాదరబోయిన విజయ్, జేరిపోతుల శ్రీనివాస్ తదితరులున్నారు.

అభివృద్ధిని అడ్డుకోవద్దు

కొత్తగూడ, వెలుగు: ఫారెస్ట్ ఆఫీసర్లు ఏజెన్సీలో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. మంగళవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మైలారంలో యూత్ కమ్యూనిటీ హాల్, కొత్తగూడలో విశ్వబ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడ్పీటీసీ నిధులతో కొత్తగూడలో ఏర్పాటు చేసిన సోలార్​స్ట్రీట్​లైట్లను ప్రారంభించారు. జూనియర్​ కాలేజీలో ప్రొజెక్టర్, ల్యాప్​టాప్ లను పంపిణీ చేశారు. ఆమె వెంట ఎంపీపీ విజయ రూప్​సింగ్, జడ్పీటీసీ పుష్పలత తదితరులున్నారు.

గుత్తికోయలకు దుప్పట్ల పంపిణీ

ఏటూరునాగారం(తాడ్వాయి), వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ముసలమ్మపెంట, సారలమ్మ గుంఫు, తక్కెళ్లగూడెం గ్రామాల్లోని గుత్తికోయలకు పోలీసులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రం నిర్వహించామన్నారు. చలికాలం నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని తెలిపారు. మావోయిస్టులకు సహకరించవద్దని కోరారు.

ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలుచేయాలి

ములుగు, వెంకటాపూర్, వెలుగు: ఆఫీసర్లు ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయాలని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎమ్మెల్సీ తాత మధు సూచించారు. సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల ఆఫీసర్లు హాజరై ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం ములుగు జిల్లాకేంద్రంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. చీఫ్ గెస్టులుగా ఇరువురు హాజరై ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఆసుపత్రి అభివృద్ధికి కమిటీ వేయాలన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే రోడ్ల రిపేర్లపై స్టేట్ లెవెల్ మీటింగ్ నిర్వహిస్తారని చెప్పారు. గ్రామాల్లో పైప్ నైన్ లీకేజీలను అరికట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ సీఈవో ప్రసూనారాణి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు హాజరయ్యారు.

అభివృద్ధికి సహకరించాలి..

తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలకేంద్రంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మెజారిటీ సభ్యులు, ఆఫీసర్లు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి ఆఫీసర్లు సహకరించాలన్నారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలన్నారు. కీలక సమావేశానికి ఆఫీసర్లు డుమ్మా కొట్టడం సరికాదన్నారు.

అధికారంలోకి వస్తేరైతులకు జీతాలు

డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్

నర్సింహులపేట, వెలుగు: రాష్ట్రంలో డీఎస్పీ అధికారంలోకి వస్తే రైతులకు నెల నెలా జీతాలు చెల్లిస్తామని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ వెల్లడించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో పాదయాత్ర చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యమేలితేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఓటు హక్కును అమ్ముకోకుండా, రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. అగ్ర కులాల లీడర్లను గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేసి, రైతుల బాధలు తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ జెండా గద్దెను ఆవిష్కరించారు.

సర్పంచ్ ని సస్పెండ్ చేయాలి

లక్ష్మీదేవి పేటలో రైతుల ధర్నా

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: భూతగాదాలు సృష్టిస్తున్న సర్పంచ్​ని సస్పెండ్ చేయాలని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం గ్రామంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్, మరికొందరు 40 ఏండ్ల కింద పంచుకున్న భూములపై కన్నేసి, లేని వివాదాలు సృష్టించి రైతులను కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నాడని మండిపడ్డారు. బినామీల కోసమే ఇదంతా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ స్టాంపును సైతం దుర్వినియోగం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. అనంతరం వెంకటాపూర్ మండల తహసీల్దార్, మండల ఎస్ హెచ్ వోలకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో రైతులు తండ రమేశ్, అంతటి మొగిలి, మడుపోజు సాంబయ్య, అంతటి రాము, అలుగోజు ఈశ్వరయ్య, గొర్రె ఓదెలు, చంద్రగిరి రాజయ్య ఉన్నారు.

శిథిలావస్థలో వర్ధన్నపేట లైబ్రరీ

జీతాలు రాక ఇబ్బంది పడుతున్న సిబ్బంది

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో లైబ్రరీ శిథిలావస్థకు చేరినా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గతంలో ఈ లైబ్రరీని పాత భవనంలో ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. వందలాది పుస్తకాలు అందుబాటులో ఉంచారు. కానీ ఈ బిల్డింగ్ పరిస్థితిని చూసి ఎవరూ లోపలికి పోవడం లేదు. పైకప్పు పెచ్చులూడుతోంది. దీంతో లైబ్రరీకి తాళం వేశారు. రాయపర్తి లైబ్రరీ ఉద్యోగిని, ఇక్కడ ఇన్​చార్జిగా వేశారు. ఆయన రెండ్రోజులకోసారి వచ్చి పోతున్నాడు. గతంలో సిబ్బంది ఉన్నా.. జీతాలు ఇవ్వకపోవడంతో వారు డ్యూటీ బంద్ పెట్టారు. పేపర్ బిల్లులు కూడా రావడం లేదని లైబ్రరీ ఇన్ చార్జి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

వర్క్స్ స్పీడప్ చేయాలి

మహబూబాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో మహబూబాబాద్ పట్టణంలో సుందరీకరణ పనులు స్పీడప్ చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డితో కలిసి టౌన్​లో పర్యటించారు. ఆర్ వోబీ గోడలపై వేస్తున్న పెయింటింగ్​ను పరిశీలించారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలన్నారు. అనంతరం టౌన్​లో ఏర్పాటు చేసిన మహారాష్ట్ర బ్యాంక్ బ్రాంచ్​ను కలెక్టర్ ఓపెనింగ్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులున్నారు.

కలెక్టర్ ఆదేశాలు గాలికి...

ఉప సర్పంచ్ ఎన్నికకు గైర్హాజరైన ఆఫీసర్లు

ఆత్మకూరు, వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల సర్పంచ్ పర్వతగిరి రాజు ఇటీవల సస్పెన్షన్​కు గురి కాగా.. ఇన్ చార్జి సర్పంచ్​గా ఉప సర్పంచ్​ను నియమించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం పంచాయతీ ఆఫీసులో ఉప సర్పంచ్ కు చెక్ పవర్ అప్పగించేందుకు గ్రామ సభ నిర్వహించగా.. ఆఫీసర్లు హాజరుకాలేదు. కేవలం వార్డు మెంబర్లు మాత్రమే హాజరయ్యారు. ఎంపీవోతో సహా ఆఫీసర్లంతా డుమ్మా కొట్టారు. గంటల తరబడి వేచి చూసిన వార్డు సభ్యులు.. పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్క చేయరా? అని ప్రశ్నించారు. ఎంపీవో కు ఫోన్ చేస్తే.. తాను రావడం లేదని, మరోసారి ఎన్నిక నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం.

26 నుంచి నర్సంపేటలో షర్మిల పాదయాత్ర

నర్సంపేట, వెలుగు: ఈ నెల 26 నుంచి నర్సంపేట నియోజకవర్గంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రెసిడెంట్ నాడెం శాంతికుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లబెల్లి మండలంలోని బొల్లోనిపల్లెలో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. మూడ్రోజుల పాటు నియోజకవర్గంలో వైయస్ షర్మిల పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. ఈ పాదయాత్రకు ప్రజలు, పార్టీ లీడర్లు, వైయస్ఆర్ అభిమానులు పాల్గొనాలని కోరారు.

ట్రైబల్ యూనివర్సిటీపై పోరు బాట

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ విమర్శించారు. మంగళవారం ఏటూరునాగారంలో నిర్వహించిన ప్రజా సంఘాల మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ములుగులో యూనివర్సిటీకి స్థలం కేటాయించినప్పటికీ, తరగతులు ప్రారంభించకుండా గిరిజన విద్యార్థుల పట్ల కేంద్రం వివక్షత చూపుతోందని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై బిల్లు  ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి అధ్యక్షులు ముంజాల బిక్షపతి, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్, మంగపేట మాజీ వైస్ ఎంపీపీ కొమరం రామ్మూర్తి తదితరులున్నారు.