ప్రభుత్వ దవాఖాన్లకు రండి.. మంచి ట్రీట్‌మెంట్ అందిస్తం

ప్రభుత్వ దవాఖాన్లకు రండి.. మంచి ట్రీట్‌మెంట్ అందిస్తం
  • ప్రజలకు మంత్రి ఈటల విజ్ఞప్తి..
  • అన్ని సౌకర్యాలు ఉన్నయి..
  • ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లకు పోయి పైసలు ఖర్చు చేసుకోవద్దు. ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి”అని కరోనా పేషెంట్లకు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని సౌలతులు ఉన్నాయని, మందులకు, ఎక్విప్మెంట్లకు కొరత లేదన్నారు. అవసరమైన చోట డాక్టర్లు, సిబ్బందిని కూడా నియమించుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖాన్లకు వస్తే మంచి ట్రీట్మెంట్ అందిస్తామని భరోసా ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ కోఠిలోని కరోనా కమాండ్ సెంటర్లో గ్రేటర్ హైదరాబాద్, చుట్టు పక్కల జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖాన్ల సూపరింటెండెంట్లు, ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సాధారణ పేషెంట్లకు జిల్లాల్లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నం. సీరియస్ పేషెంట్లకు గాంధీలో ఇస్తున్నం. కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ, మరణాలు మాత్రం 0.5 శాతమే ఉన్నయి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఎఫెక్టివ్గా చేస్తున్నం. అందుకే డెత్ రేట్ ఇంత తక్కువగా ఉంది. వైరస్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతోంది. కట్టడి చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నం. ట్రేసింగ్ కోసం కొత్త యాప్ తెచ్చాం. అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ సెంటర్లు పెట్టాం. గ్రేటర్ హైదరాబాద్, మహారాష్ర్ట బార్డర్ జిల్లాల్లో ఎక్కువ కేసులు వస్తున్నయి. ఆయా జిల్లాల్లో టెస్టులు సంఖ్య పెంచాలని చెప్పినం. ఫస్ట్ వేవ్లో 70 శాతం మంది ఎసింప్టమాటిక్ ఉంటే, ఈసారి 90 శాతం కేసులు ఎసింప్టమాటిక్ వస్తున్నాయి. కరోనా సింప్టమ్స్ ఉన్నవాళ్లు, పాజిటివ్ వచ్చిన వాళ్లను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలే’అని ఈటల పేర్కొన్నారు. 
వ్యాపార కోణం సరికాదు
ఈ కరోనా కష్టకాలంలో వ్యాపార కోణం సరికాదని, ప్రజలను ఆదుకునే దృష్టితో పనిచేయాలని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కరోనా ట్రీట్మెంట్కు చాలా తక్కువ ఖర్చు అవుతుందని, అయితే కొన్ని హాస్పిటళ్లు ఎక్కువ చార్జ్ చేస్తున్నాయని, ఈ పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు. బార్లు, క్లబ్బులు, పబ్బులు కరోనా రూల్స్ పాటిస్తూనే నడుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చామన్నారు. ఒకవేళ వాటిల్లో నిబంధనల ఉల్లంఘన జరిగితే వాటిని మూసివేస్తామని తెలిపారు. ప్రస్తుతం రోజూ 50 వేల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, రాబోయే రోజుల్లో రోజూ లక్షన్నర మందికి వ్యాక్సిన్ వేస్తామన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటళ్ల వరకూ అని చోట్ల కరోనా, నాన్ కరోనా వైద్య సేవలు కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. ఏ దవాఖాన్లలో నాన్ కరోనా సేవలు బంద్ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 

త్వరలో గాంధీలో 200 ఆక్సిజన్ బెడ్లు.. ఇప్పటికే 300 ఐసీయూ బెడ్లు రెడీ
గాంధీ ఆస్పత్రిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా త్వరలోనే మరో 200 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు సూపరింటెం డెంట్ డాక్టర్ రాజారావు బుధవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే 300 ఐసీయూ బెడ్లు రెడీగా ఉన్నాయ న్నారు. ప్రస్తుతం 182 మంది కరోనా పేషెంట్లు ఐసీయూ వార్డుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా గాంధీలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎవరూ ఇండ్లలోంచి బయటకు రావద్దని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ పెట్టుకోవడంతో కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించారు.