నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్.. సాయం చేయాలన్న నూకరాజు

నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్.. సాయం చేయాలన్న నూకరాజు

జబర్దస్ద్ ద్వారా అందరికీ పరిచయమైన కమెడియన్ పంచ్ ప్రసాద్. శ్రీదేవి డ్రామా కంపెనీతో అతడు మరింత ఫేమస్ అయ్యాడు. కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ తన వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్‌లో వాడి అందరినీ నవ్వించాడు. 

ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు. నూకరాజు చేసిన వ్లాగ్ ద్వారా ఈ విషయం అందరికీ తెలిసింది. ‘‘ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్‌గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు డాక్టర్లు చెప్పారు’’ అని ప్రసాద్ భార్య తెలిపింది. 

ఇందులో తన ఆరోగ్య పరిస్థితిని బయటకు చెప్పేందుకు పంచ్‌ ప్రసాద్‌ ఇష్టపడలేదు. అయినా చాటుగా ఈ వీడియో తీసి ఆయన ఆరోగ్య పరిస్థిని చూపించాడు నూకరాజు. ప్రసాద్‌కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పాడు. అభిమానులు కూడా ప్రసాద్‌కి సపోర్ట్ చేయాలని కోరాడు. 

ప్రసాద్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో గతంలో చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు. జబర్దస్త్‌ షోను కూడా మానేశాడు. ఆ సమయంలో మిగితా ఆర్టిస్టులు అతనికి ఆర్థిక సహాయం అందించారు. అయితే తెర వెనక ఎన్ని ఇబ్బందులున్నా బుల్లితెరపై కడుపుబ్బా నవ్వించేడమే లక్ష్యంగా పెట్టుకుంటాడీ కమెడియన్‌. అటువంటి ప్రసాద్ ఆరోగ్యంగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.