
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేతల కంప్లైంట్ ఆధారంగా బంజారాహిల్స్ పీఎస్ లో బండి సంజయ్ పై కేసు ఫైల్ అయింది. ఐపీసీ సెక్షన్ 354/A, 504, 509 సెక్షన్ల కింద బంజారహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ బండి సంజయ్ విచారణకు డీజీపీని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని బండి సంజయ్ ను మహిళా కమిషన్ ఆదేశించనుంది. బండి సంజయ్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో వైపు బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై ఎస్ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళి సై స్పందించాలని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.