
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎక్సైజ్ శాఖలో త్వరలో కానిస్టేబుళ్ల నుంచి అన్ని స్థాయిల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని ఆ శాఖ కమిషన్ సి. హరి కిరణ్ అన్నారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో క్రైమ్‌ను అరికట్టడంతో పాటు ఎక్సైజ్ శాఖకు ఆదాయ వనరులను పెంపొందించడంపై అందరు దృష్టి సారించాలని తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎక్సైజ్ భవన్‌లోని సమావేశ మందిరంలో తెలంగాణ ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కమిషనర్‌తో పాటు ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు. జనవరి 25 నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల క్రైమ్ రేట్, రెవెన్యూ వ్యవహరాలపై ప్రధానంగా కమిషనర్, డైరెక్టర్ సమీక్షించారు. రాబోయే వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 25 లక్షల తాటి, ఈత మొక్కలను నాటాలని కమిషనర్ ఆదేశించారు. త్వరలో మంత్రులు కూడా మొక్కలు నాటే కార్యక్రమం పై సమీక్షించనున్నారని చెప్పారు.
గంజాయి, డ్రగ్స్, మిథనినాల్, ఆల్ఫజోలం, మిథనాల్, ఫ్యూరియస్ లిక్కర్, ఎన్‌డీపీఎల్ లిక్కర్ పై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, జాయింట్ కమిషనర్లు కే.ఏ.బీ శాస్త్రీ, సురేశ్ పాల్గొన్నారు.