ముదిరాజ్​ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం : వివేక్ వెంకటస్వామి

ముదిరాజ్​ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం : వివేక్ వెంకటస్వామి
  • వాళ్లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారిస్తే మరింత లబ్ధి
  • నేషనల్ హైవే బైపాస్​లో భూములు కోల్పోతున్నోళ్లకు న్యాయం చేస్తమని భరోసా
  • కోరుట్ల నియోజకవర్గంలో పర్యటన.. కాంగ్రెస్​లో 200 మంది చేరిక

మెట్ పల్లి/కోరుట్ల, వెలుగు: ముదిరాజ్ ల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. శనివారం కోరుట్ల నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వెంకటాపూర్ లో దాదాపు 100 మంది ముదిరాజ్ సంఘ సభ్యులు కాంగ్రెస్​లో చేరారు. వారికి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ చార్జ్ జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు కండువాలు కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. ముదిరాజ్​లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చాలన్న అంశానికి కాంగ్రెస్​ కట్టుబడి ఉందని చెప్పారు. వారిని బీసీ–ఏలో చేర్చితే మరింత లబ్ధి పొందుతారని చెప్పారు. కులగణన చేపడితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి చేసిన పోరాటం మరువలేనిదన్నారు.  మాజీ మంత్రి రత్నాకర్ రావు కోరుట్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని.. ఆయన ఆశయాలను కుమారులు నర్సింగరావు, కృష్ణారావు కొనసాగిస్తున్నారని కొనియాడారు. అనంతరం మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు పేరుతో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల టోల్ ఫ్రీ నంబర్  94401 52929, దానికి సంబంధించిన పోస్టర్లను వివేక్ ఆవిష్కరించారు. కాగా, మరో కార్యక్రమంలో 100 మంది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు.  

భూనిర్వాసితులకు న్యాయం చేస్తం.. 

నేషనల్ హైవే 63 బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్నోళ్లకు న్యాయం చేస్తామని వివేక్ హామీ ఇచ్చారు. మెట్ పల్లిలో బైపాస్ రోడ్డులో భూములు కోల్పోతున్న 8 గ్రామాల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. ‘‘మాకు వ్యవసాయమే జీవనాధారం. ఏడాదికి రెండు పంటలు పండే  భూములను బైపాస్ రోడ్డు కోసం ఇవ్వాలని అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బైపాస్ రోడ్డు పేరిట మాభూములు లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారు. భూములు లాక్కుంటే కుటుంబాలను ఎట్ల పోషించుకోవాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బైపాస్ రోడ్డు సర్వే, నష్టపరిహారం తదితర వివరాలను నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్, రెవెన్యూ అధికారులను వివేక్ అడిగి తెలుసుకున్నారు. రైతుల డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి, నేషనల్ హైవేస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. రైతులు కోరుతున్నట్టు రీఅలైన్మెంట్ చేయాలని, లేదంటే  మార్కెట్ వాల్యూ కన్నా  మూడింతల నష్టపరిహారం ఇవ్వాల్సిన  అవసరం ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లి సంబంధిత అధికారులతో చర్చించి  రైతులకు నష్టం జరగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. 

కాళేశ్వరంతో చుక్క నీరు రాలే.. 

కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదని వివేక్ ​అన్నారు. ‘‘కేసీఆర్​ పదేండ్లు అవినీతి పాలన కొనసాగించారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అందులో లక్షల కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ తన ఇంట్లో ఆరుగురు మున్సిపల్ లేబర్లతో పనులు చేయించుకుంటున్నారు” అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడని, చాలా గొప్ప వ్యక్తి అని, ఆయనను ఎంపీగా గెలిపించాలని కోరారు. కాగా, తమను రెగ్యులరైజ్ చేయాలని వివేక్ కు రిసోర్స్ పర్సన్స్, సెకండ్​ ఏఎన్ఎంలు వినతిపత్రం అందజేశారు. 

వివేక్ సాబ్.. భూనిర్వాసితులను ఆదుకోండి: జీవన్ రెడ్డి

వివేక్ సాబ్.. భూనిర్వాసితులను ఆదుకొని, పుణ్యం కట్టుకోండని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. రైతుల నుంచి సాగు భూమిని తీసుకునేటప్పడు దానికి మూడింతల సాగు భూమి ఇవ్వాలని చట్టంలో ఉందని గుర్తు చేశారు. రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ కాకుండా ఓపెన్ మార్కెట్ వాల్యూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పేరిట మూడుసార్లు సర్వే చేసి అప్పటి అలైన్మెంట్ ఎందుకు మార్చారని అధికారులను ప్రశ్నించారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉద్యమంలో తమకు ఆదర్శమని, ఆయన ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు.