వంట సామాన్ల రేట్లు భగ్గుమంటున్నయ్​

వంట సామాన్ల రేట్లు భగ్గుమంటున్నయ్​
  • పప్పులు, నూనెలు, కూరగాయలు, ఉల్లి రేట్ లు కొండెక్కినయ్‌
  • మార్కెట్‌‌లో ఏదీ కొనలేని పరిస్థితి

హైదరాబాద్‌‌, వెలుగుఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అన్నట్లుగా పరిస్థితి తయారైంది. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. పప్పులు, నూనెలు, చింతపండు ఇలా ఒక్కటేమిటి అన్ని రేట్లు చుక్కలను అంటుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కరోనా వచ్చాక ఉద్యోగాలు పోగొట్టుకున్నోళ్లు, సగం జీతాలు తీసుకుంటున్నోళ్లు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

10 నుంచి 75 శాతం వరకు..

రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలు 10 శాతం నుంచి 75 శాతం వరకు పెరిగాయి. దీంతో పప్పు ధాన్యాలపై తీవ్ర ప్రభావం పడింది. డిమాండ్‌ అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు మండుతున్నాయి. వ్యాపారులు కొందరు కృత్రిమ కొరత సృష్టించి మరి రేట్లు పెంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు సరుకులు కొనాలంటేనే భయపడిపోతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీంతో తాము నిలువు దోపిడీకి గురవుతున్నామని వాపోతున్నారు.

అన్నీ మండిపోతున్నయ్..

మార్కెట్లు, సూపర్ మార్కెట్లలో నూనె ప్యాకెట్లు లీటరుపై ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.30 తక్కువకే దొరికేవి. కానీ ఇప్పుడు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.130, పల్లీ నూనె రూ.150 పైగా విక్రయిస్తున్నారు. అలాగే ఇడ్లీ రవ్వ కిలో రూ.40, బొంబయ్ రవ్వ 40, పల్లీలు కిలో రూ.110, చక్కెర 38, చింతపండు కిలో రూ.240 నుంచి 250 వరకు అమ్ముతున్నారు. కిలో రూ.30 ఉన్న గోధుమ పిండి ఇప్పుడు రూ.45కు చేరింది. కిలో రూ.70 ఉన్న కంది పప్పు కిలో రూ.110కు చేరింది. పెసర పప్పు రూ.120 నుంచి రూ.150, మినపపప్పు రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. మిర్చి పొడి కిలో రూ.250 నుంచి -రూ.300 మధ్య విక్రయిస్తున్నారు. పల్లీల ధరను కిలోకు రూ.80 నుంచి రూ.120 కు పెంచారు. చిల్లర దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఇక ఒక గుడ్డు ధర రూ.6కి చేరింది. కిలో చికెన్ ధర రూ.250 వరకు పలుకుతోంది. మటన్ కిలో రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారు.

గాడ్జెట్స్రేట్లు పెరిగినయ్‌..

గాడ్జెట్స్‌ ధరలు కూడా పెరిగాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ల రేట్లు 50 శాతం వరకు పెరిగాయి. తమ ఆదాయం తగ్గినా, పిల్లల ఆన్‌లైన్ తరగతుల కోసం కంప్యూటర్లు, సెల్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.