
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్కు సంబంధించిన కామన్ మొబిలిటీ కార్డ్ మరింత ఆలస్యం కానుంది. గత నెల 31న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. విలీన అంశంతో పాటు ఆగస్ట్ రెండో వారం కల్లా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణానికి ఈజీ అయ్యేలా కామన్ మొబిలిటీ కార్డ్ తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా కామన్ మొబిలిటీ కార్డును తీసుకొస్తున్నాం. మొదట మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా కార్డుని జారీ చేస్తాం. ఇదే కార్డుతో భవిష్యత్తులో ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటో సేవలను కూడా పొందేందుకు వీలుగా విస్తరిస్తాం’’ అని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అయితే, ఆగస్ట్ రెండో వారం పూర్తయినా కార్డ్ తీసుకొచ్చే అంశంపై ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదని అధికారులు చెబుతున్నారు. దాంతో కార్డుల అమలు మరింత లేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఆర్టీసీలో అమలు సాధ్యమేనా..
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం సుమారు 2,900 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇందులో నిత్యం లక్షలాది మంది జర్నీ చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా సిటీలో ఎంఎంటీఎస్, ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో చెల్లే విధంగా కామన్ బస్ పాస్ అమలవుతోంది. మెట్రో వచ్చాక ఆ పాస్ లు తీసుకునే వారి సంఖ్య తగ్గింది. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో , కాలేజ్ రూట్లలో వేలాడుతూ జర్నీ చేస్తుంటారు. ఈ రద్దీలో టికెట్ ఇవ్వటం కండక్టర్లకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో కామన్ మొబిలిటీ కార్డ్ అమలు నిర్ణయంపై అధికారులు, రవాణా నిపుణుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రద్దీగా ఉండే బస్సుల్లో ఈ కార్డ్ అమలు చాలెంజింగేనని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ప్రస్తుతం ముంబై, బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ గా అమలవుతోంది. అక్కడ అమలు తీరును పరిశీలించటానికి ఆర్టీసీ ఐటీ ఆఫీసర్స్ వెళ్లి వచ్చారు. జిల్లాలో యుపీఐ స్కానర్లు, కార్డ్ స్వైపింగ్ ద్వారా టికెట్ ఇచ్చే టిమ్ మెషిన్లను అమలు చేస్తున్నా కండక్టర్లు, డ్రైవర్లకు పూర్తి స్థాయిలో అవగాహన రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా అలాంటి ఇబ్బందే తలెత్తవచ్చని అభిప్రాయ పడుతున్నారు. రద్దీ ఉన్నప్పటికీ ట్రైన్ ఎక్కేముందు , దిగేముందు టికెట్ లేదా కార్డ్ ను స్వైప్ చేస్తేనే గేట్ ఓపెన్ అవుతోంది. కాబట్టి కామన్ మొబిలిటీ కార్డ్ ను మెట్రోలో అమలు చేయడం ఈజీనే అని అధికారులు పేర్కొన్నారు.
బిల్లుకు మరో వారం టైమ్
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ లా సెక్రటరీకి పంపారు.దాంతో బిల్లు ఆమోదానికి మరో వారం పట్టేలా ఉంది. బిల్లు ఆమోదం కావడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఫైనల్ రిపోర్ట్ వచ్చాకే బిల్లు అమలు కానుంది. ఇదంతా జరగడానికి మరో నెల రోజులు టైమ్ పట్టే అవకాశాలు కనపడుతున్నాయి.