ఖైరతాబాద్ టూ పంజాగుట్ట రూటు.. ఈ భారీ ట్రాఫిక్ జాం నుంచి బయటపడితే గ్రేటు !

ఖైరతాబాద్ టూ పంజాగుట్ట రూటు.. ఈ భారీ ట్రాఫిక్ జాం నుంచి బయటపడితే గ్రేటు !

హైదరాబాద్: హైదరాబాద్ సిటీని వాన వదిలేలా లేదు. గురువారం సాయంత్రం కూడా హైదరాబాద్ సిటీని వర్షం ముంచెత్తింది. భారీ వర్షం కారణంగా ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే ప్రధాన రహదారిలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు నరకం చూశారు. వర్షపు నీరు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలో వాతావరణం గురువారం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ బానే కొట్టినా సాయంత్రానికి మాత్రం వాతావరణం చల్లబడింది. గురువారం రాత్రి 7.30 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ సిటీలో బుధవారం (సెప్టెంబర్ 17) కూడా వర్షం దంచికొట్టిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి సిటీ శివార్లలో ఓ మోస్తరు వర్షం కురవగా, కోర్ సిటీలో 6.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాన్​స్టాప్ ​వాన కురిసింది. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు చెప్తున్నారు.

ALSO READ : ఓరి దేవుడా.. హైదరాబాద్‎లో ఈ కుండపోత వర్షం ఏంటి సామీ: రోడ్లపై వరదలా వెల్లువెత్తిన నీళ్లు

మెయిన్​రోడ్లు మొదలుకుని ఇంటర్నల్​ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్​లతో జనం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్​సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మెట్టుగూడ డివిజన్ విజయపురి కాలనీలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. సీతాఫల్​మండిలో ప్రహరీ గోడ కూలిపోవడంతో పక్కనే ఉన్న నాలా నీళ్లు ఇండ్లలోకి వచ్చాయి.