సన్ ఫ్లవర్ లో సూపరోలిన్ కలుపుతున్న కంపెనీలు

సన్ ఫ్లవర్ లో సూపరోలిన్ కలుపుతున్న కంపెనీలు
  • తక్కువ రేటు ఉన్న సూపరోలిన్ కలుపుతున్న కంపెనీలు 
  • ఉక్రెయిన్ యుద్ధంతో నిలిచిపోయిన దిగుమతులు 
  • ఇప్పటికే ఉన్న స్టాక్ ను బ్లాక్ చేసి రేట్ల పెంపు 
  • స్టాక్ అంతా అయిపోవడంతో కల్తీ బాట

హైదరాబాద్‌‌, వెలుగు: సన్ ఫ్లవర్ ఆయిల్ కు కొరత ఏర్పడడంతో కంపెనీలు కల్తీకి పాల్పడుతున్నాయి. సన్ ఫ్లవర్ లో పెద్ద ఎత్తున సూపరోలిన్ ఆయిల్ కలిపి విక్రయిస్తున్నాయి. రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి మన దేశానికి సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. ఇదే అవకాశంగా ఇంతకుముందు ఉన్న స్టాక్ ను కంపెనీలు బ్లాక్ చేశాయి. హోల్ సేల్, రిటైల్ మార్కెట్లు, మాల్స్ లో ఎక్కడ చూసినా సన్ ఫ్లవర్ ఆయిల్ షార్టేజ్ ఉంది. దీంతో ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఉన్న స్టాక్ దాదాపు అయిపోవడంతో కంపెనీలు కల్తీ బాట పట్టాయి.

లీటర్ పై రూ.70 అదనపు ఆదాయం.. 

సన్ ఫ్లవర్ ఆయిల్ కు డిమాండ్ ఎక్కువ ఉండడం, స్టాక్ మాత్రం అసలే లేకపోవడంతో కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. తక్కువ ధరకు వచ్చే సూపరోలిన్ ను సన్ ఫ్లవర్ ఆయిల్ పేరుతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. లీటర్ పామాయిల్ నూనె రూ.140 ఉండగా, లీటర్ సూపరోలిన్ రూ.143కు లభ్యమవుతోంది. సన్ ఫ్లవర్ ను పామాయిల్‌‌తో కల్తీ చేస్తే, గడ్డ కట్టి సన్‌‌ ఫ్లవర్‌‌ ఆయిల్‌‌ కాదని తెలిసిపోతుంది. అందుకే ఆయిల్ కంపెనీలు సూపరోలిన్ తో కల్తీ చేస్తున్నాయి. రూ.143 ఉన్న లీటర్ సూపరోలిన్ ను సన్ ఫ్లవర్ పేరుతో రూ.210 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నాయి. ఈ లెక్కన లీటర్ నూనెపై అదనంగా రూ.70 నుంచి 80 వరకు అదనపు ఆదాయం పొందుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. నూనె కల్తీ చేస్తున్న కంపెనీలపై దాడులు 
చేయడం లేదు. 

రష్యా నుంచొస్తే సమస్య తీరినట్టే... 

మన దేశానికి 60 నుంచి 70 శాతం సన్ ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుంచే వస్తోంది. రష్యాలో సన్ ఫ్లవర్ ఉత్పత్తి ఎక్కువే అయినా, అక్కడి నుంచి మనకు దిగుమతులు తక్కువే. అయితే ఇప్పుడు యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. మరోవైపు రష్యాపై యూరోపియన్ దేశాలు ఆంక్షలు పెట్టడంతో ఆ దేశంలో సన్ ఫ్లవర్ ఆయిల్ నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మన దేశానికి ఎగుమతి చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. ఇప్పటికే మన దేశ కంపెనీలు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో రష్యా నుంచి ఆయిల్ వస్తే, ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ కు రూ.210 నుంచి రూ.225 వరకు ఉంది.

సూపరోలిన్ ఆయిల్ అంటే? 

పామాయిల్‌‌‌‌‌‌‌‌ను బ్లెండింగ్‌‌‌‌‌‌‌‌ చేసి పామోలిన్‌‌‌‌‌‌‌‌ తయారు చేస్తారు. దీన్ని మరింత రిఫైన్‌‌‌‌‌‌‌‌ చేస్తే సూపరోలిన్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ వస్తుంది. ఇది చూడ్డానికి వాటర్ లాగే ఉంటుంది. సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. పైగా అందులో కలిపినా ఎలాంటి తేడా కనిపించదు. దీంతో సన్ ఫ్లవర్ ఆయిల్ ను పెద్ద ఎత్తున సూపరోలిన్ తో కల్తీ చేస్తున్నారు. అయితే సూపరోలిన్ నూనెను వంటల్లో వాడితే ప్రమాదమేమీ లేదని విజయ ఆయిల్స్ మేనేజర్ తిరుమలేశ్వర్ రెడ్డి చెప్పారు. కానీ సన్ ఫ్లవర్ అని భ్రమపడి, దాన్ని కోనుగోలు చేసి ప్రజలు మోసపోతున్నారని తెలిపారు.