మెదక్ జిల్లాలో పెరిగిన క్రైమ్రేట్

మెదక్ జిల్లాలో పెరిగిన క్రైమ్రేట్
  • పెరిగిన హత్యలు, అత్యాచారాలు
  • గతేడాది కంటే 9.6 శాతం ఎక్కువ కేసులు నమోదు
  • తగ్గిన దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు

మెదక్​, వెలుగు:  గతేడాదితో  పోల్చితే మెదక్ జిల్లాలో ఈ ఏడాదిలో క్రైమ్​ రేట్​ పెరిగింది. 2024లో మొత్తం 4,871 కేసులు నమోదు కాగా 2025లో ఇప్పటి వరకు 5,388 కేసులు నమోదయ్యాయి. అంటే గతేడాది కంటే 517 కేసులు (9.6 శాతం) పెరిగాయి. 

సోమవారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2025 నేర నివేదికను ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు​ వెల్లడించారు. ఘటనల వారీగా చూస్తే హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్​ లు పెరుగగా, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. 

రికవరీ ఇలా..

దొంగతనాల కేసుల్లో రికవరీ శాతం గతేడాది కంటే స్వల్పంగా తగ్గింది. 2024లో  రూ.3,36,54,826 విలువైన ఆస్తి చోరీకి గురికాగా అందులో రూ.1,22,57,329 (36.42 శాతం) రికవరీ అయింది. 2025లో రూ.2,64,18,260 విలువైన ఆస్తి చోరీకి గురికాగా అందులో రూ.93,17,509  (35.27 శాతం) రికవరీ అయింది. ఈ ఏడాది మొత్తం 606 దొంగతనం కేసులు నమోదు కాగా అందులో 290 (47.85 శాతం) కేసులు డిటెక్ట్​ అయ్యాయి. 

మహిళలపై పెరిగిన నేరాలు

గతేడాదిలో పోల్చి చూస్తే ఈ సారి మహిళలపై నేరాలు పెరిగాయి. వరకట్న చావులు, ఆత్మహత్యలు, భర్తల వేధింపులు, హత్యలు, రేప్​లు, పెళ్లికి నిరాకరించడం, కిడ్నాప్​లు, ఈవ్​టీజింగ్​ వంటి కేసులు 2024లో 355 నమోదు కాగా, 2025లో 417 నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ కేసులు గతేడాది 48 నమోదు కాగా ఈ సారి 52కు పెరిగాయి. మిస్సింగ్ కేసులు గతేడాది 397  నమోదుకాగా 450 మంది అదృశ్యం అయ్యారు. వారిలో 412 మందిని గుర్తించారు. ఈ సారి 454 మిస్సింగ్​ కేసులు  నమోదు కాగా 492 మంది అదృశ్యం అయ్యారు. వారిలో 445 మందిని గుర్తించారు. 

తగ్గిన మరణాలు

2024లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 636 రోడ్డు ప్రమాదాలు జరిగి 350 మంది మృతి చెందారు. 625 మంది గాయపడ్డారు. ఈ సారి 598 ప్రమాదాలు జరుగగా247 మంది మృతి చెందారు. 598 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ప్రమాదాలు 6 శాతం తగ్గగా మరణాలు 29 శాతం తగ్గాయి. 

సైబర్​ క్రైమ్​ కేసులు ఇలా..

జిల్లాలో గతేడాది 94 సైబర్​ క్రైమ్​ కేసులు నమోదు కాగా ఈసారి 126 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. బాధితులు రూ.3,73,16,252 కోల్పోయారు. అందులో సైబర్​ క్రైమ్​ డిపార్ట్​మెంట్​ రూ.82,63,285 ఫ్రీజ్​ చేశారు. రూ.60,04,588 రీఫండ్ చేశారు. సైబర్​ క్రైమ్ పై జిల్లా వ్యాప్తంగా 324 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 

షీటీమ్స్​ ద్వారా

మెదక్, తూప్రాన్ పోలీస్​ డివిజన్​ల పరిధిలో షీటీమ్స్​ ద్వారా ఈ సారి 45 ఎఫ్​ఐఆర్​లు, 162 పెట్టీ కేసులు, 709 రెడ్​ హ్యాండెండ్​ కేసులు నమోదు చేశారు. 654 మందికి కౌన్సెలింగ్​ ఇచ్చారు. 565 అవేర్​ నెస్​ ప్రోగ్రామ్స్​ నిర్వహించారు. 

పెరిగిన డ్రంకన్ డ్రైవ్​కేసులు 

మద్యం తాగి వాహనాలు నడపడాన్ని అరికట్టేందుకు పోలీసులు డ్రంకన్​డ్రైవ్​నిర్వహిస్తున్నారు. గతేడాది జిల్లాలో 6,563 కేసులు నమోదు చేయగా వారిలో 11 మందికి జైలు శిక్ష పడింది. ఈ ఏడాది 11,716 కేసులు నమోదు కాగా 9 మందికి జైలు శిక్ష పడింది. ఈ సారి పేకాట కేసులు 73 నమోదు కాగా 472 మందిని అరెస్ట్​ చేసి రూ.18,18,024 సీజ్​ చేశారు. 

సిద్దిపేటలో తగ్గిన క్రైం రేట్

సిద్దిపేట రూరల్: సిద్దిపేట కమిషనరేట్‌లో ఈ ఏడాది క్రైం రేటు తగ్గిందని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరంలో  7,144 కేసులు నమోదవగా గతేడాది 6,853 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2024లో 25 హత్య కేసులు నమోదు కాగా ఈ ఏడాది 22 హత్య కేసులు నమోదయ్యాయని, దోపిడీ కేసులు 260 నుంచి 231కి తగ్గాయని, చైన్​స్నాచింగ్ కేసులు 9 నుంచి13కి పెరగగా, దొంగతనం కేసులు 488 నుంచి 481 కి తగ్గినట్లు వివరించారు. 

731 ఆస్తి కేసులు నమోదు కాగా అత్యాచార కేసులు 80 నుంచి 53కి తగ్గాయని, పోక్సో కేసులు 97 నుంచి 79కి, మహిళలపై నేరాల కేసులు 589 నుంచి 572కి తగ్గినట్లు, పంచాయతీ ఎన్నికల్లో 507 కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు. 2024లో 718 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా 315 మరణాలు, 645 మందికి గాయాలయ్యాయి. ఈ సంవత్సరంలో 716 రోడ్డు ప్రమాద కేసుల్లో 274 మంది మరణించగా 599 మందికి గాయాలయ్యాయి.

 4,52,776 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసి రూ. 16,73,29,000 జరిమానా విధించినట్లు తెలిపారు. రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్ గన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా, 61,147 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు చేసి, రూ. 6,32,67,845 జరిమానా విధించినట్లు సీపీ తెలిపారు. మొత్తంగా ఈ సంవత్సరంలో 15,323 ట్రాఫిక్ కేసులు నమోదు చేసి, 219 మందికి జైలు శిక్షలు విధించినట్లు పేర్కొన్నారు. 

77 గేమింగ్ యాక్ట్  కేసులు నమోదు చేసి రూ. 11,25,700 స్వాధీనం చేసుకున్నామని, 440 ఎక్సైజ్ యాక్ట్ కేసులు, 203 అక్రమ ఇసుక రవాణా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కేసులు 49 నుంచి 41కి తగ్గాయని, 46,123 డయల్ 100 కాల్స్‌కు పోలీసులు హాజరయ్యారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి 16 కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టినట్లు వివరించారు. 


హత్యలు, అత్యాచారాలు

                                          2024                  2025
హత్యలు                           28                     30
ఆస్తికోసం హత్యలు          13                    4
కిడ్నాప్​లు                        41                   44
అత్యాచారాలు                  48                  56

దోపిడీలు, దొంగతనాలు

                                   2024              2025
దోపిడీలు                    14                  11
పగటి దొంగతనాలు    29                 31
రాత్రిదొంగతనాలు    188               168
గొలుసు దొంగతనాలు   7                3
సాధారణ దొంగతనాలు   249       212
ఆలయ చోరీలు          26                26
ఆటో మెబైల్​ చోరీలు  179            155
మొత్తం                          692           606