పంట నీట మునిగితే ఇకపై పరిహారం.. పీఎం ఫసల్ బీమా యోజనలో కొత్త రూల్.. జంతువుల దాడిలో నష్టపోయినా వర్తింపు

పంట నీట మునిగితే ఇకపై పరిహారం.. పీఎం ఫసల్ బీమా యోజనలో కొత్త రూల్.. జంతువుల దాడిలో నష్టపోయినా వర్తింపు
  • 2026–27 ఖరీఫ్ నుంచి అమలు 
  • కేంద్రమంత్రి శివరాజ్​ సింగ్ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్​బీవై) కింద ఇకపై జంతువుల దాడి, వరదలు/నీట మునగడం వల్ల కలిగే పంట నష్టానికి కూడా పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రైతులు చాలా కాలంగా చేస్తున్న రిక్వెస్ట్​ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇప్పటిదాకా ఈ పథకంలో కేవలం ప్రకృతి వైపరీత్యాలు (కరువు, వడగండ్లు, తుఫానులు మొదలైనవి) మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఈ రెండు కొత్త రకాల నష్టాలను చేర్చామని తెలిపారు. 

మహారాష్ట్ర నాగ్​పూర్​లో నిర్వహించిన ఆగ్రోవిజన్ ఈవెంట్​లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘‘ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోతే లేదా దెబ్బతింటే బాధిత రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పరిహారం చెల్లిస్తాం. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్ – జులై) నుంచి అమల్లోకి వస్తుంది. 2025 – 26 ఖరీఫ్ సీజన్‌‌‌‌‌‌‌‌కు ఇది వర్తించదు. ఇది ప్రాథమిక బీమాలో భాగంగా కాకుండా, ‘యాడ్-ఆన్’ (అదనపు) కవరేజీగా ఉంటుంది. 

ఏ ఏ జిల్లాల్లో.. ఏ జంతువుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. దాని ఆధారంగానే బీమా వర్తిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఈ రెండు రకాల పంట నష్టాలను బీమా కవరేజీలో చేర్చాం. పంట నష్టం జరిగిన 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’  ద్వారా నష్టపోయిన పంట ఫొటోలను జియో -ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. దీనివల్ల నష్టాన్ని కరెక్ట్​గా అంచనా వేయడానికి వీలవుతుంది’’ అని శివరాజ్​సింగ్ చౌహాన్ తెలిపారు.

6 శాతం పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి

2023–24తో పోలిస్తే 2024–25లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 6 శాతం పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్ తెలిపారు. గత 10–11 ఏండ్లలో మొత్తం ఉత్పత్తి 44 శాతం పెరిగిందని చెప్పారు. ‘‘ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా ఎప్పుడు వర్షాలు పడుతాయో.. ఎప్పుడు కరువు వస్తుందో తెలవట్లేదు. ఈ ఏడాది వర్షాలు 5 నుంచి 6 నెలల పాటు కురిసాయి. సెప్టెంబర్​లో వరదలకు చాలామంది రైతులు నష్టపోయారు. మహారాష్ట్రలో ఏనుగులు, పులులు, అడవి పందుల కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులుపడ్తున్నారు. 

ఫసల్ బీమా యోజన కింద పరిహారం చెల్లించాలని కోరుతూ వచ్చారు. తాజాగా ఈ తరహా నష్టానికి కూడా పరిహారం చెల్లిస్తాం. ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్.. సరికొత్త దిశగా అడుగులు వేస్తున్నది. ఆలోచన నుంచి ఆవిష్కరణకు, యాంత్రీకరణ నుంచి డైవర్సిఫికేషన్​కు, ఇంటిగ్రేషన్ నుంచి ఇరిగేషన్​కు, శాటిలైట్ నుంచి డ్రోన్ల​కు మన వ్యవసాయం మారుతున్నది. మోదీ నాయకత్వంలో అగ్రికల్చర్ సెక్టార్​లో దూసుకుపోతున్నం’’ అని శివరాజ్ ​సింగ్ అన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం

ఆరెంజ్ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాలు ఎంతో అవసరమని శివరాజ్​సింగ్ చౌహాన్ తెలిపారు. రూ.70 కోట్లతో నాగ్​పూర్​లో నారింజ పంట కోసం క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ‘‘జీనోమ్ ఎడిటింగ్ మెథడ్​తో ప్రభుత్వం రెండు రకాల ధాన్యాలను విజయవంతంగా ఉత్పత్తి చేసింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలు అందజేయడంపై ఐసీఏఆర్ సైంటిస్టులు దృష్టిపెట్టాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలు సాగు చేయాలి. సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్​ను అడాప్ట్ చేసుకోవాలి. ఎన్నో ప్రైవేటు సెక్టార్​ కంపెనీలు సాగుకు అవసరమైన యంత్రాలను తయారు చేస్తున్నాయి. వాటిని సబ్సిడీ కింద అందుబాటులో ఉంచాయి’’ అని శివరాజ్​సింగ్ తెలిపారు.