
నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియాలో మెరుగైన వైద్యం అందిస్తామని, అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనా స్థలిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 304, 285, 286, ఐపీసీ 9 బీ(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న ఓ నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ లో నవంబర్ 13వ తేదీన ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.