మా భూములు కాజేసేందుకు తహసీల్దారుకు రూ.40 లక్షలు లంచం ఇచ్చిండు

మా భూములు కాజేసేందుకు తహసీల్దారుకు రూ.40 లక్షలు లంచం ఇచ్చిండు

శామీర్ పేట, వెలుగు: తమ భూములు కాజేసేందుకు కబ్జాదారుడు శామీర్ పేట తహసీల్దార్​సత్యనారాయణకు రూ.40 లక్షలు  లంచం ఇచ్చాడని పలువురు బాధితులు శుక్రవారం మేడ్చల్​జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం లాల్గడి మలక్​పేట గ్రామ శివారులోని సర్వే నంబర్ 308, 312, 313, 317, 125, 131లోని 19 ఎకరాలను 2016లో కొనుగోలు చేశామని చెప్పారు. 2019లో పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చాయని, తర్వాత రైతుబంధు పొందామని తెలిపారు. 2022 నుంచి రైతుబంధు నిలిచిపోగా, పలుమార్లు శామీర్​పేట తహసీల్దార్​ను కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. నిజామాబాద్​లో ఉండే తమకు ఇక్కడి భూములపై దళారుల కన్ను పడిందని తెలియదని వాపోయారు.

మూడు రోజుల కింద ‘ఏసీబీకి చిక్కిన శామీర్ పేట తహసీల్దార్’ అనే వార్తలు చూసి కంగుతిన్నామని చెప్పారు. మువ్వా రామశేషగిరిరావు అనే వ్యక్తి తహసీల్దార్ సత్యనారాయణకు భారీ మొత్తంలో లంచం ఇచ్చి, లాల్గడి మలక్​పేటలోని తమ భూములు కాజేయాలని స్కెచ్​వేశాడన్నారు. 19 ఎకరాలను తన పేరిట మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకొని భూములు కొట్టాయలని చూస్తున్నాడని చెప్పారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఆగిన రైతుబంధును తిరిగి ఇప్పించాలని కోరారు.