నమస్తే తెలంగాణ, టీ న్యూస్​పై  కేంద్రానికి ఫిర్యాదు

నమస్తే తెలంగాణ, టీ న్యూస్​పై  కేంద్రానికి ఫిర్యాదు
  • చర్యలు తీస్కోవాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి బీజేపీ నేతల విజ్ఞప్తి
  • భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విషం చిమ్ముతున్నయని ఆరోపణ

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్లను వక్రీకరిస్తూ ప్రజలను టీ న్యూస్​ చానెల్​, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు తప్పుదారి పట్టించాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్​ నేతృత్వంలోని పార్టీ నేతలు.. బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషీని కోరారు. ఢిల్లీలోని అక్బర్​ రోడ్​ 11లోని ప్రహ్లాద్​ జోషి ఇంట్లో సమావేశం అయ్యారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఆ వార్తా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రికి వివరించారు. టీఆర్​ఎస్​ పార్టీ కనుసన్నల్లోనే ఆ వార్తా సంస్థలు నడుస్తున్నాయని, ఆ పార్టీ ఆఫీస్​లోనే టీ న్యూస్​ చానెల్​ ఉందని పేర్కొన్నారు. మంత్రితో భేటీ అయిన వారిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్​, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, కేంద్ర జలవనరుల సంఘం సలహాదారు వెదిరె శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.  
ఆ మూడు వార్తా సంస్థలు.. కేసీఆర్​ దోపిడీ, అవినీతికి రక్షణ కవచాలు: సంజయ్​
బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడేలా టీ న్యూస్​, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేలు తెలంగాణ సెంటిమెంట్​ను రెచ్చగొడుతూ అబద్ధపు కథనాలు రాస్తున్నాయని బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్​ మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషితో భేటీకి ముందు ఆయన తరుణ్​చుగ్​ ఇంట్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రధాని  మోడీ కృషి చేస్తుంటే.. ఆ వ్యాఖ్యలను వక్రీకరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొనసాగిస్తున్న దోపిడీకి, అవినీతికి రక్షణ కవచాల్లా ఆ మూడు వార్తా సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏడేండ్లలో టీ న్యూస్​ చానెల్​, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు ప్రకటనల ద్వారా వందల కోట్ల రూపాయలను తెలంగాణ సర్కారు కేటాయించిందని ఆరోపించారు. ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రభుత్వ ఖజనాకు గండి కొడుతున్నారని మండిపడ్డారు.
అర్వింద్ ఫిర్యాదుపై లోక్​సభ సెక్రటేరియట్​ నోటీసులు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పేపర్ల ఎడిటర్లకు లోక్​సభ సెక్రటేరియట్​ (ప్రివిలేజ్​ అండ్​ ఎథిక్స్​ బ్రాంచ్​) నోటీసులు ఇచ్చింది. ‘ప్రత్యేక హక్కు ఉల్లంఘన, సభ ధిక్కరణ’ కింద ఎంపీ అర్వింద్​ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లోక్​సభ డిప్యూటీ సెక్రటరీ జి. బాలగురు మంగళవారం పత్రికలకు నోటీసులను పంపారు. నోటీసులు అందిన 72 గంటల్లోపు (ఈ నెల 25) లోపు లోక్​సభ స్పీకర్​ ముందు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే ఆ పత్రికల ఎడిటర్ల మీద చట్టపరంగా చర్యలు తీస్కుంటామని హెచ్చరించారు.