
- వార్డులు, డివిజన్లు చిందరవందర
- ప్రతి పట్టణంలో ఫిర్యాదుల వెల్లువ
- జాబితాలో తప్పులు, వేలాది ఓట్లు గల్లంతు
- బోగస్ ఓట్ల నమోదు, అధికారులపై ఒత్తిళ్లు
- కోర్టులకు వెళ్తున్న కొందరు నేతలు
- బైంసా, శంషాబాద్ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే
మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం చేస్తున్న హడావుడితో కొత్త చిక్కులు మొదలయ్యాయి. అత్యంత కీలకమైన వార్డుల పునర్విభజన ప్రక్రియ.. ఓటర్ల జాబితాలతయారీ గందరగోళంగా మారింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ముసాయిదా కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉండటంతో రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వార్డుల పునర్విభజనతో పాటు ఓటర్ల జాబితాల్లో తప్పులపై వచ్చిన పిటిషన్లపై హైకోర్టు జోక్యం చేసుకుంది. రెండు మున్సిపాలిటీల్లో వార్డుల విభజనపై స్టే జారీ చేసింది.గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తమున్సిపల్ చట్టం రూపొందించటంతోపాటు.. ఆగస్టులో ఎన్నికల ప్రక్రియనుముగించాలని ప్రభుత్వం స్పీడ్ గా ఉంది.ఇందులో భాగంగానే కొత్త చట్టం అమల్లో కి తెచ్చేందుకు ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయటంతో పాటు.. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓటర్ల జాబితా, వార్డుల విభజన షెడ్యూలును ముందుకు జరిపింది. దీంతో పని ఒత్తిడితో పాటు రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు.
తొలి జాబితాకే సవరణ
త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు హడావుడిగా చేసిన వార్డుల విభజనలో పారదర్శకత, శాస్త్రీయత లోపించిందని చాలాచోట్ల రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో తొలి అంకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం కోసం ఈ నెల 3న 131 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనమైన జడ్చర్ల గ్రామ పంచాయతీతోపాటు నల్గొండ జిల్లా నకిరేకల్ నగర పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో మరుసటి రోజే ఈ రెండు మున్సిపాలిటీల పేర్లను ఎన్నికల సంఘం తొలగిస్తూ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికలు నిర్వహించబోయే మునిసిపాలిటీల సంఖ్య 129కి చేరింది.
రెండింటిలో వార్డుల విభజనపై స్టే
ఎన్నికలు నిర్వహించబోయే మున్సిపాలిటీల్లో చేపట్టిన వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీపై ముందునుంచీ ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ తమకు అనుకూలంగా డీలిమిటేషన్ చేయిస్తోందని, తమ అభ్యర్థులు పోటీ చేసేందుకు అనువుగా ఓటర్ల జాబితాలు, వార్డుల విభజనను ఇష్టమొచ్చినట్లు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బైంసా మున్సిపల్ పరిధిలో వార్డుల పునర్విభజనలో శాస్త్రీయత లోపించిందని, ఒకే దగ్గర ఉన్న ఇళ్లను వేర్వేరు వార్డుల్లో కలిపారని టీఆర్‌ఎస్ నాయకుడితోపాటు ఓ అడ్వకేట్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు వార్డుల పునర్విభజన ముసాయిదాపై స్టే ఇచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితా, వార్డుల విభజన సక్రమంగా లేదని ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు శుక్రవారం స్టే విధించింది. వార్డుల విభజన, రిజర్వేషన్ల వంటి అంశాలపై తిరిగి ఉత్తర్వులు ఇవ్వాలని, అప్పటివరకూ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించకూడదని జడ్జి జస్టిస్ నవీన్‌రావు మధ్యంతర ఆదేశాలిచ్చారు. దీంతో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మిగతా మున్సిపాలిటీల్లోని నేతలు కూడా ఇదే వరుసలో కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
నల్గొండలో ఓసీల సంఖ్యలో కోత
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన కూడా అనుమానాలు రేకెత్తించింది. గత మున్సిపల్ ఎన్నికలప్పుడు 44 వేల మంది ఓసీలుండగా.. ఇప్పుడు కేవలం 27 వేల మంది ఉన్నట్లు ముసాయిదా విడుదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా కొందరు నేతలు ఓట్ల జాబితాలను తమకు అనువుగా మలుచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఉన్న ఓట్లను వివిధ వార్డులకు షిఫ్ట్ చేశారు. గెలుపొందాలనే ముందస్తు ప్లాన్‌తో కొన్ని కుటుంబాలు ఒకే ఓటర్లను వివిధ వార్డుల్లో సర్దుబాటు చేసుకున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలప్పుడు ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండాలనే నిబంధనను అమలు చేసిన అధికారులు.. ఇప్పుడు వార్డుల వారీగా ఓట్లను విభజించేటప్పుడు ఇష్టమున్నట్టు మార్చేశారు.
సెలవుపై మిర్యాలగూడ కమిషనర్!
రాజకీయ ఒత్తిళ్లు, ఓటర్ల జాబితాల తయారీపై వెల్లువెత్తిన ఆరోపణలతో మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ సెలవు పెట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీలో గతంలో 36 వార్డులు ఉండగా ప్రస్తుతం 48 వార్డులుగా పునర్విభజించారు. వార్డుల విభజనలో కనీస నిబంధనలను పాటించలేదని, వందలాది ఓట్లను గల్లంతు చేశారని అఖిల పక్ష నేతలందరూ ఇటీవల ఆల్ పార్టీ మీటింగ్‌లో కమిషనర్‌ను నిలదీశారు. వార్డుల హద్దులను విభజించిన తీరు అస్తవ్యస్తంగా ఉందని ప్రతిపక్ష నేతలు, ఉన్నదున్నట్టే కొనసాగించాలని అధికార పార్టీ నేతలు పట్టుబట్టారు. దీంతో ఈ నెల 10 ఓటర్ లిస్టు డ్రాఫ్ట్ ను పబ్లిష్ చేయాల్సి ఉంటే ఇక్కడి అధికారులు ఒక రోజు ఆలస్యంగా విడుదల చేశారు. జోనల్, ఎన్నికల టీమ్‌ల జాబితాను అందజేయడంలో కమిషనర్ జాప్యం చేయటంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కమిషనర్ అధికారిక సిమ్‌ను ఆఫీసులో అప్పగించి సెలవుపై వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. అయితే అనారోగ్యంతోనే సెలవు పెట్టినట్లు అక్కడి ఉద్యోగులు చెప్తున్నారు.
పరకాలలో 78 ఫిర్యాదులు
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఒకే రోజు 78 ఫిర్యాదులు అందాయి. మ్యాప్‌లో చూసి వార్డులు విభజించటంతో కాలనీలకు కాలనీలే మారిపోయాయని, కులగణనలోనూ భారీగా పొరపాట్లు దొర్లాయని, ఈ తప్పులన్నీ రిజర్వేషన్లపై ప్రభావం చూపుతాయని స్థానిక నేతలు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
మంచు మనోజ్ కు నారాయణఖేడ్ లో ఓటు!
హైదరాబాద్‌లో ఉండే సినీనటుడు మంచు మనోజ్ కు నారాయణఖేడ్ లో ఓటు హక్కు వచ్చింది. అవును ఇది నిజం. అధికారుల పొరపాటుకు ఇది ఓ మచ్చుతునక. అక్కడి మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితాలో మనోజ్ పేరు 2 వ వార్డ్ లో 428 సీరియల్ నెంబర్లో నమోదై ఉంది. ఇది గమనించిన కొందరు ఓటరు జాబితాను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వైరల్ అయింది. ఈ జాబితాలో మంచు మనోజ్ ఫొటో క్లియర్ గా కనపడుతోంది. అలాగే జాబితా లో సైతం తండ్రి పేరు మంచు మోహన్ బాబు గా నమోదైంది.