ఆర్డర్ పెడితే క్వాలిటీ ఫుడ్ రావట్లే

ఆర్డర్ పెడితే క్వాలిటీ ఫుడ్ రావట్లే
  • పేరొందిన రెస్టారెంట్స్ నుంచి బేకరీల వరకు ఇదే పరిస్థితి
  • వర్షాకాలం కావడంతో భయాందోళనకు గురవుతున్న కస్టమర్లు

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్​ హైదరాబాద్​లోని పేరొందిన రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు కుళ్లిపోయిన, పురుగులు పట్టిన ఫుడ్​ను డెలివరీ చేస్తున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నార్మల్​హోటళ్లు, రెస్టారెంట్లపై నమ్మకం లేక పెద్ద వాటిల్లోంచి ఆన్ లైన్​లో ఆర్డర్ పెడితే క్వాలిటీ ఫుడ్ రావడం లేదని రోజూ 20కిపైగా కంప్లయింట్లు జీహెచ్​ఎంసీకి అందుతున్నాయి. ఆన్​లైన్​ యాప్​లలో బుక్ చేస్తున్న ఫుడ్​ డెలివరీపై హోటళ్ల నిర్వాహకులు పెద్దగా పట్టించుకోవడంలేదు. వెజిటేరియన్ అయితే  కుళ్లిన ఆహారం, నాన్ వెజ్​ అయితే ఉడికీ ఉడకని మాంసాన్ని అందిస్తున్నారు. ప్యాకింగ్ ఐటమ్స్​ అయితే దుర్వాసన వస్తున్నాయని జీహెచ్​ఎంసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కస్టమర్లు ఆన్​లైన్​ ఆర్డర్లు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఫుడ్​ పాయిజనింగ్​ జరిగే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. 

బిర్యానీలో మెటల్​ వైర్​! 

షేక్​పేట్​ దర్గాలోని ఓ ఫేమస్ రెస్టారెంట్​ నుంచి బిర్యానీని ఆర్డర్​ చేస్తే  అందులో ఒక ఇంచ్​ మెటల్ వైర్ వచ్చిందని, అది కడుపులోకి వెళ్తే పరిస్థితి ఏంటని శ్రీరామ్ అనే సిటిజన్  బల్దియాకు ఫిర్యాదు చేశాడు. అలాగే రాంనగర్ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని ఓ రెస్టారెంట్​లో బిర్యానీ బుక్ చేస్తే బల్లి వచ్చిందని ఇటీవల ఆయన ఆందోళనకు దిగారు.  ఇలాంటివి వందలాది ఘటనలు జరుగుతున్నా అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  నామ్కేవాస్తేగా కొన్ని రెస్టారెంట్లకు పెనాల్టీలు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని కస్టమర్లు అంటున్నారు. 

డైలీ 20 కిపైగా ఫిర్యాదులు

గ్రేటర్ పరిధిలో ఫుడ్ బాగాలేదంటూ డైలీ 20కిపైగా ఫిర్యాదులు జీహెచ్ఎంసీ కి వస్తున్నాయి. కంట్రోల్​ రూమ్, ట్విట్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నేరుగా కంప్లయింట్స్​ వస్తున్నాయి.  ఫిర్యాదులు వచ్చిన హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ, సూపర్ మార్కెట్లలో శాంపిళ్లను ఆఫీసర్లు సేకరిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినవి కాకుండా ప్రతి ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్ నెలకి 6 శాంపిళ్లను సేకరించాల్సి ఉంది. అయితే ఆ రిపోర్టులు వచ్చేందుకు టైం పడుతుందని చెప్తూ దాట వేస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయంపై అధికారులను అడిగితే తాము శాంపిల్ సేకరించి షోకాజు నోటీసులు జారీ చేయడం వరకు మాత్రమేనని, పెనాల్టీలు జాయింట్​ కలెక్టర్లు వేయాల్సి ఉంటుందని అంటున్నారు. జీహెచ్​ఎంసీలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఈ ఏడాదిలో 30 మంది రెస్టారెంట్ల, హోటళ్ల నిర్వాహకులకు పెనాల్టీలు వేశారు. ఆన్​లైన్​ పార్శిల్​ ఇస్తే అడిగేదెవరని రెస్టారెంట్​, హోటల్​ నిర్వాహకులు క్వాలిటీ లేని ఫుడ్​ పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రూట్స్  నుంచి బిర్యానీ, కర్రీస్, కేకులు, బేకరీ ఐటమ్స్​ వరకు ఏది ఆన్ లైన్​లో ఆర్డర్ చేసినా క్వాలిటీ ఉండటంలేదు. దీంతో ఆన్ లైన్ ఆర్డర్లు అంటేనే జనం భయాందోళనకు గురవుతున్నారు.

హైదరాబాద్​ మాసబ్ ట్యాంక్​లోని ఓ పెద్ద రెస్టారెంట్​ ఫుడ్​ కోసం ఆన్​లైన్​లో ఆర్డర్ చేస్తే క్వాలిటీ బిర్యానీ రావడంలేదని అహిక్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీకి కంప్లయింట్ చేశాడు. రెండు నెలలుగా ఇలాగే ఉంటోందని, ఆన్​లైన్ ఆర్డర్లను అసలు పట్టించుకోవడంలేదని పేర్కొన్నాడు. సంబంధిత రెస్టారెంట్​పై చర్యలు తీసుకోవాలని కోరాడు.

హైదరాబాద్​లోని కోంపల్లికి చెందిన కిశోర్.. ఈ నెల 4న ఆన్ లైన్​లో ఫ్రూట్స్​ని బుక్ చేశాడు. డెలివరీ అయ్యే సరికే ఆ పండ్లు పాడైపోయాయి. తన భార్య ఆరో నెల గర్భవతి అని, ఇలాంటి ఫ్రూట్స్​ తినిపిస్తే పరిస్థితి ఏంటని జీహెచ్ఎంసీకి, మంత్రి కేటీఆర్​కు ఫిర్యాదు చేశాడు.

ఫుడ్ క్వాలిటీ లేకుంటే ఫిర్యాదు చేయండి

హోటళ్లు, రెస్టారెంట్లలో ఎక్కడైనా పాడయిపోయిన ఫుడ్ పెట్టినా.. క్వాలిటీ సరిలేకపోయినా గ్రేటర్ హైదరాబాద్​ హెల్ప్​ లైన్ నంబర్ 040–21111111 కు ఫోన్ చేయండి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 
-  బాలాజీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, జీహెచ్ఎంసీ