NBK 111: బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబోలో మరో మాస్ ప్రాజెక్ట్.. దసరాకు ‘NBK 111’ షురూ!

NBK 111:  బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబోలో మరో మాస్ ప్రాజెక్ట్..  దసరాకు ‘NBK 111’ షురూ!

నందమూరి అభిమానులకు మరో పండగ రాబోతోంది! 'వీరసింహారెడ్డి' 'అఖండ',  'డాకు మహారాజ్ ' వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ మూవీలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పడు ఈ ఇద్దరి ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ‘NBK 111’ వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

భారీ యాక్షన్‌తో చారిత్రక కథాంశం

వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్న ఈ ‘NBK 111’ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా అట్టహాసంగా ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం మాస్ యాక్షన్‌తోనే కాకుండా, చారిత్రక అంశాలను జోడించి ఓ సరికొత్త ఎపిక్ స్టోరీగా తెరకెక్కనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బాలయ్య ఇందులో మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన, చారిత్రక పాత్రలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య తన తదుపరి చిత్రం 'అఖండ 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత, ఆయన దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడితో మరోసారి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చారిత్రక చిత్రంగా గొప్ప విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వారిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారని, దీనిపై కూడా విజయ దశమికి అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

రెండు ప్రాజెక్టులు సమాంతరంగా..

‘NBK 111’ చిత్రీకరణతో పాటు క్రిష్‌తో చేయబోయే సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది బాలయ్య అభిమానులకు నిజంగా డబుల్ ట్రీట్ అని చెప్పాలి. గోపీచంద్ మలినేని ఈసారి కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను జోడించి అద్భుతమైన కథను సిద్ధం చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, బాలయ్య తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు.