హైదరాబాద్ సిటీలో.. 103 ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం.. అక్కడ ఎకరం రూ.100 కోట్లు !

హైదరాబాద్ సిటీలో.. 103 ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం.. అక్కడ ఎకరం రూ.100 కోట్లు !
  • 5 రోజుల్లో ప్లాట్ల వేలం
  • 103 ప్లాట్లను ఈ-వేలం వేయనున్న  హెచ్ఎండీఏ  
  • చదరపు గజం ధర రూ.65 వేల నుంచి లక్షా 20 వేలు
  • ప్లాట్​ధరలో 25 శాతం.. మొదటి విడతలోనే చెల్లించాలి 
  • ఇప్పటికే ప్రీబిడ్​సమావేశాలు పూర్తి  చేసిన ఆఫీసర్లు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్ ​పరిధిలో హెచ్ఎండీఏ అధికారులు ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం చేశారు. గతంలో వేలం వేసి మిగిలిపోయిన ప్లాట్లను మరోసారి వేలం ద్వారా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న హెచ్ఎండీఏ ఈ ప్లాట్ల వేలం ద్వారా భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నది. హెచ్ఎండీఏ ప్లాట్లు కొనడం వల్ల కొన్ని రకాల లాభాలు ఉంటాయి. క్లియర్​ టైటిల్ తో పాటు రూల్స్​ప్రకారం లేఅవుట్లు వేస్తారు. అందువల్లే ఇప్పటివరకూ హెచ్ఎండీఏ వేలం వేసిన భూములకు మంచి రెస్పాన్స్​వచ్చింది. 

అక్కడ ఎకరానికి రూ.100 కోట్లు
ఇప్పటివరకు హెచ్ఎండీఏ ఉప్పల్​భగాయత్, కోకాపేట, బుద్వేల్, తెల్లాపూర్, కీసర, బాటసింగారం, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున లేఅవుట్స్​వేసి అమ్మింది. కోకాపేట, నియోపోలిస్​వంటి లేఅవుట్స్​లో ఎకరానికి రికార్డు స్థాయిలో రూ.100 కోట్లు పలికింది. ఈసారి 103 ప్లాట్లను వేలం వేయనున్నది. ఇందులో తుర్కయాంజాల్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో భూములకు మంచి ధర పలికే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఈ స్థలాల దగ్గర ఐటీ సంస్థలు, మల్టీనేషనల్​ కంపెనీలు, కమర్షియల్​గా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాలు కావడంతో ఎక్కవే పలకవచ్చంటున్నారు. ఇప్పటికే వేలానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోని భూముల వివరాలు, భవిష్యత్​లో రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులకు సమాచారం వివరించడంతో పాటు వేలంలో ఎలా పాల్గొనాలి? తమ ధరలు ఎలా కోట్​ చేయాలి? అన్న డిటెయిల్స్​తెలియజేస్తూ ప్రీబిడ్​సమావేశాలు నిర్వహించి అవగాహనా కార్యక్రమాలు కూడా చేపట్టింది.

17 నుంచి భూముల వేలం 
ఈనెల 17 నుంచి 19 వరకు ఆన్​లైన్​ (ఈ–వేలం) ద్వారా హెచ్ఎండీఏ వేలం వేయనున్నది. 17న తుర్కయంజాల్లో 12 ప్లాట్లు , 18న బాచుపల్లిలో 70ప్లాట్లు, 19న రంగా రెడ్డి జిల్లాలో నాలుగు, మేడ్చల్ జిల్లా పరిధిలో 7 ప్లాట్లను వేలం వేయనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల్లో వేలం వేసే భూముల వివరాలను వెల్లడించలేదు. వేలానికి రెండు రోజుల ముందు పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

ధర రూ.65 వేల నుంచి లక్షా 20 వేలు 
ప్లాట్ల వేలంలో ఆయా ప్రాంతాలను బట్టి ప్లాట్ల ప్రారంభ ధర (సర్కారు ధర) 65 వేల నుంచి లక్షా 20వేల వరకు ఉంటుంది. వేలంలో ప్లాట్లను సొంతం చేసుకున్న వారు మొదటి విడత చెల్లింపుగా మొత్తం ప్లాట్​ధరలో 25 శాతం చెల్లించాలి. నిర్ణీత కాల వ్యవధిలో రెండో వాయిదా లేక తుది వాయిదాగా 75 శాతం చెల్లించాల్సి ఉంటుంది.