ఏషియన్ అమెరికన్లపై దాడులను ఖండిస్తున్నం

ఏషియన్ అమెరికన్లపై దాడులను ఖండిస్తున్నం
  • మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
  • కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సెనేటర్లు, కాంగ్రెస్ మెన్ ఓకే

వాషింగ్టన్: ఏషియన్ అమెరికన్లపై అన్ని రకాల వివక్ష, హింసను వ్యతిరేకిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, పలువురు యూఎస్ లామేకర్లు అన్నారు. 2019లో ఏషియన్ అమెరికన్లపై దాడుల కేసులు 216 కాగా, కిందటేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు 3 వేలకుపైగా కేసులు నమోదైనట్టు ఎఫ్ బీఐ లెక్కలు చెబుతున్నాయి. ‘ఏషియన్ అమెరికన్లపై కొనసాగుతున్న వివక్ష ఆందోళన కలిగిస్తోంది. మన సమాజంలో ద్వేషం, జాతి వివక్ష, హింసకు చోటు లేదు. ఏషియన్, ఏషియన్ అమెరికన్లకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతా’ అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ఏషియన్ అమెరికన్లపై జరిగిన నేరాలు సరికాదని, ఇలాంటి వాటిని ఆపాలని ప్రెసిడెంట్ బైడెన్ చెప్పిన మరుసటి రోజే సత్యనాదెళ్ల ట్వీట్ చేశారు. జనవరిలో ప్రెసిడెంట్​గా బాధ్యతలు చేపట్టిన వెంటనే బైడెన్.. ఏషియన్ అమెరికన్లపై జరిగిన హింసాత్మక దాడులను ఖండించారు.


ద్వేషం, హింసకు చోటు లేదు: లా మేకర్స్

కరోనా టైమ్​లో ఏషియన్ అమెరికన్లు, పసిఫిక్ ఐలాండర్లపై హింసాత్మక ఘటనలను వ్యతిరేకిస్తూ కొందలు లా మేకర్లు కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు చేతులు కలిపారు. రేసిస్ట్ దాడులపై కాంగ్రెస్ మెన్ డొనాల్డ్ ఎం,పేనే కూడా ఆందోళన వ్యక్తంచేశారు. 'అమెరికాలో ద్వేషం, హింసకు చోటులేదు. వేలాది మైళ్ల దూరంలో పుట్టిన కరోనాకు ఏషియన్ అమెరికన్లను నిందించడం, వారిపై దాడులు చేయడం ఆపాలి. డైవర్సిటీని సపోర్ట్ చేసే ప్రెసిడెంట్ మనకు రావడం మంచి పరిణామం. అమెరికన్లందరూ ఒక్కటవ్వాల్సిన టైమ్ వచ్చింది' అని అన్నారు. కరోనాకు ఏషియన్ అమెరికన్లకు ముడిపెడుతూ దాడులకు పాల్పడ్డారని, ఇది పూర్తిగా జాతి వివక్ష అని సెనేటర్ డయాన్నె ఫైన్ స్టైన్ అన్నారు. ఏషియన్ అమెరికన్లపై దాడులను ఆపాలంటూ సెనేట్ జ్యుడీషియరీ కమిటీ మెంబర్ అలెక్స్ పాడిల్లా, సెనేటర్ మేజీ  హిరోనో, కాంగ్రెస్ మెన్ గ్రేస్ మెంగ్ బిల్లును ప్రవేశపెట్టారు.