
కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎన్నిక కూడా అప్పుడే
న్యూఢిల్లీ: మూడు నెలల సాగదీతకు ముగింపు పలుకుతూ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. మొదట ఈవారంలోనే భేటీ ఉంటుందనే సంకేతాలిచ్చినా, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పారు.
గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్‌లో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇన్చార్జిలు సమావేశమై సీడబ్ల్యూసీ, రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకల ఏర్పాట్లపై చర్చ జరిపారు. మీటింగ్ తర్వాత సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ భేటీకి సంబంధించి తేదీ ఇంకా ఖరారు కాలేదన్నారు. పార్లమెంట్ సెషన్ తర్వాతే సీడబ్ల్యూసీ నిర్వహించాలన్న కేసీ వేణుగోపాల్ ప్రతిపాదనను అందరూ సమర్థించారని మరో సీనియర్ నేత పీఎల్ పునియా చెప్పారు.
జనరల్ సెక్రటరీ హోదాలో ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ చీఫ్ బాధ్యతల్ని ప్రియాంకే తీసుకోవాలంటూ జార్ఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్పీఎన్ సింగ్ కోరగా, అందుకామె సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7 తో ముగియనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయనకు మద్దతుగా ఏఐసీసీ నుంచి డీసీసీ దాకా పలువురు ఆఫీస్ బేరర్లు రాజీనామా చేశారు. సీడబ్ల్యూసీ భేటీతో కాంగ్రెస్ చీఫ్ ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఏడాది విశేషమైందని, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలతోపాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరపాలని పార్టీ నిర్ణయించినట్లు సుర్జేవాలా చెప్పారు. ఆగస్టు 20న రాజీవ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని, అంతకంటే ముందు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రాజీవ్‌ను స్మరించుకుంటూ ఆయా ప్రాంతాల బాధ్యులు కార్యక్రమాల్ని చేపడతారని తెలిపారు.