
ఎల్బీనగర్, వెలుగు: అధికార దాహంతో బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కాంగ్రెస్ లోకి రానివ్వబోమని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్నాయకులు తేల్చిచెప్పారు. సోమవారం మహేశ్వరంలో సబితారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హైకమాండ్2018లో మల్లు భట్టి విక్రమార్కను శాసనసభా పక్ష నేతగా నియమించడాన్ని జీర్ణించుకోలేకపోయిన సబితారెడ్డి పార్టీ మారిందని, ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంలో కీలక పాత్ర పోషించిందని మండిపడ్డారు.
గతంలో కాంగ్రెస్హైకమాండ్ఆమెను రెండు సార్లు మంత్రిని చేసిందని గుర్తుచేశారు. సబితపై అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు ఉన్నా పెద్ద మనసుతో 2018లో మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. ఎంతో కష్టపడి గెలిపించుకున్న కాంగ్రెస్కార్యకర్తలను మధ్యలో వదిలేసి, బీఆర్ఎస్ లోకి జంప్అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లిన నీచ చరిత్ర ఆమెదని విమర్శించారు.
బీఆర్ఎస్ప్రభుత్వంలో మంత్రి అయ్యాక కాంగ్రెస్ లీడర్లను, కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టిందని, అక్రమ కేసులు బనాయించి పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పిందని మండిపడ్డారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్లో చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, బండి మధు సూదన్ రావు, సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని శంకర్ యాదవ్, నల్లెంకి ధనరాజ్ గౌడ్, తలాటి రమేశ్నేత, మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నానవాల జ్ఞానేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.