50 ఏళ్లు చేతకాలే.. కానీ ఒక్క ఛాన్స్ కావాలంటా?

50 ఏళ్లు చేతకాలే.. కానీ ఒక్క ఛాన్స్ కావాలంటా?

రెండు జాతీయ పార్టీలు నీతిలేని పార్టీలన్నారు మంత్రి కేటీఆర్. నారాయణపేట జిల్లాలో పలు  అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ పట్ల కేసీఆర్ కు ఉన్న ఆర్తీ, ప్రేమ , ఢిల్లీ గుజరాత్ వాళ్లకు ఉంటదా?..అలాంటి కేసీఆర్ ను గుండెల్లో పెట్టుకోవాలన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆర్థిక చోదక శక్తిగా 4 వ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. కాంగ్రెస్,బీజేపీ పాలనలో రైతుల ఆదాయం డబుల్ కాలేదు కానీ.. కన్నీళ్లు , కష్టాలు డబుల్ అయ్యాయన్నారు. 50 ఏళ్లు చేతకాలేదు కాని ఒక్క చాన్స్ కావాలంటా అని అన్నారు. ఇది టెన్ జన్ పద్ కాదు.. తెలంగాణ చైతన్యం ఉన్న జనపద్ అని అన్నారు. 

తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని.. సిగ్గులేకుండా పాదయాత్రలు చేస్తున్నారన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయన్నారు. కులం ,మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందన్నారు.  కేంద్రం రూ. 25 వేల కోట్లు ఇచ్చినా ఇవ్వకున్నా.. మోటర్ల దగ్గర మీటర్ పెట్టబోమన్నారు. మే 14 న తెలంగాణకు వస్తున్న అమిత్ షా..  రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలన్నారు.  చేనేత మీద పన్ను పోటు వేసిన మొట్టమొదటి ప్రధాని మోడేనన్నారు.మోడికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే సుష్మారాజ్ చెప్పినట్లు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలన్నారు. ఉర్దూ భాషపై విష పూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు.  దమ్ముంటే పాలమూరు అభివృద్ధి కోసం రూ. 30 వేల కోట్లు,  అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలన్నారు. కర్ణాటకకు వెళ్లి అక్కడా..ఇక్కడా జరుగుతున్న అభివృద్ధిని..రైతు వేదికలు, ప్రకృతి వనాలు, ఉత్తమ గ్రామాలను చూపిస్తవా అని బండి సంజయ్ కు సవాల్ విసిరారు.  తాను చెప్పినదాంట్లో ఒక్క తప్పున్నా ఏ శిక్షకన్నా సిద్ధమన్నారు.

రాబోయే నెల రోజుల్లో నారాయణపేటలో ఇంటింటికి తాగునీరందిస్తామన్నారు. ఏడాదిలోగా బంగారు మార్కెట్ ను ఆధునీకరిస్తూ గోల్డ్ సూట్ ను నిర్మిస్తామన్నారు. కంసాన్ పల్లిలో 200 ఎకరాలను సాగు చేస్తున్న పేద రైతులకు యాజమాన్య హక్కులు కలిపించి రైతు బంధు అందజేస్తామన్నారు. మిగతా 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాకు సేవాలాల్ భవన్ ను మంజూరు చేస్తామన్నారు. నారాయణపేట ప్రభుత్వాసుపత్రి జనం క్యూ కడుతున్నారంటే కారణం ప్రభుత్వాసుపత్రులపై గౌరవం పెరగడమేనన్నారు . తెలంగాణలో ఉన్నట్లు 973 గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 63 లక్షల మందికి 5 వేలు పంట పెట్టుబడి అందిస్తున్నామన్నారు.