పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
ఇబ్రహీంపట్నం, వెలుగు: కమీషన్లు తీసుకొని జేబులు నింపుకోవడం తప్ప రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో కమీషన్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శనివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్‌మెట్ మండలం మన్నెగూడలో నిర్వహించిన బీజేపీ సమావేశానికి ఆయనతో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘స్ఫూర్తి ఫౌండేషన్’ చైర్మన్ బసరాజు సురేశ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీలో చేరగా, వారికి రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీగా ఒక్కటయ్యారని, వీరి బంధం ‘ఫెవికాల్, ఫెవిస్టిక్’ బంధం లాంటిదని ఎద్దేవా చేశారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానాన్ని ఈ రెండు పార్టీలు వ్యతిరేకిస్తూ ఒకే మాట మాట్లాడుతున్నాయని దుయ్యబట్టారు.
