వచ్చే నెలలోనే లోక్​సభ ఎన్నికల ప్రచారం!

వచ్చే నెలలోనే లోక్​సభ ఎన్నికల ప్రచారం!

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. పోలింగ్​కు చాలా టైం ఉండడంతో స్లో అండ్​ స్టడీ అన్న ధోరణిలో అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ​క్యాండిడేట్లు ఫైనల్​అయినప్పటికీ.. ఆ పార్టీలు ప్రచారంలో మాత్రం స్పీడ్​ పెంచడం లేదు. అధికార కాంగ్రెస్​పార్టీకి సంబంధించి మరో ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్​కాలేదు. ఒకటి, రెండు రోజుల్లో వారి లిస్ట్​ కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.​

అయితే, బీజేపీ, కాంగ్రెస్​ రెండు పార్టీలు చేరికల మీద దృష్టి పెట్టగా.. తమ పార్టీ లీడర్లను, క్యాడర్​ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ​నిమగ్నమైంది. అయితే, అన్ని పార్టీలు వచ్చే నెలలో ప్రచారాన్ని స్పీడప్​ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఏప్రిల్​మొదటి వారంలో కాంగ్రెస్​ పార్టీ తుక్కుగూడలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అక్కడి నుంచే ప్రచారానికి శంఖారావం పూరించనుంది. బీజేపీ, బీఆర్ఎస్​కూడా వచ్చే నెల రెండో వారంలో విస్తృత సభలకు ప్లాన్​ చేస్తున్నాయి.

చేరికలపైనే కాంగ్రెస్ ఫోకస్ 

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేరికలపైనే ఫోకస్​ పెట్టింది. అలాగే, ఏప్రిల్​ మొదటి వారంలో రాహుల్​ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో తెలుగులో మేనిఫెస్టో రిలీజ్​ చేయించే సభను తుక్కుగూడలో ఏర్పాటు చేస్తోంది. ఆ తరువాత రేవంత్ రెడ్డి వరుస ఎన్నికల ప్రచార సభలను ప్లాన్​ చేసుకున్నారు. ప్రతి పార్లమెంట్​నియోజకవర్గంలో కనీసం రెండు,  మూడు సభలు పెట్టాలని చూస్తున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీతోనూ సభలు, ర్యాలీలకు ప్లాన్​ చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు 'పాంచ్​ న్యాయ్'ను జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా 14 సీట్లు గెలవాలని చూస్తున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ప్రతి రోజూ తన నివాసంలో లీడర్లతో భేటీ అవుతున్నారు. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సూచనలు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్​స్థానాల్లో మల్కాజ్ గిరి మాదిరిగా మూడంచెల వ్యూహం అమలు చేయాలని చూస్తున్నారు. 

మోదీ చరిష్మానే నమ్ముకున్న బీజేపీ అభ్యర్థులు

బీజేపీ ఎంపీ అభ్యర్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మానే నమ్ముకున్నారు. దీంతో తమ నియోజకవర్గాల్లో మోదీతో బహిరంగ సభలు పెట్టించుకునేందుకు ఎవరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్​లో ఒకటి, జీహెచ్​ఎంసీ పరిధిలో రెండు, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్​లోనూ సభలు ఏర్పాటు చేయించుకునేలా ఏర్పాట్లు చేయించుకుంటున్నారు.

కనీసం నాలుగైదు చోట్ల అయినా మోదీతో సభలు ఏర్పాటు చేయించాలని రాష్ట్ర బీజేపీ భావిస్తున్నది. అయితే, ఇవన్నీ రెండో వారం తరువాతే మొదలుపెట్టనున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లోనే మోదీ తెలుగు రాష్ట్రాలకు సమయం ఇచ్చినట్లు తెలుస్తున్నది. బీజేపీ అభ్యర్థులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగలేదు. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్, కరీంనగర్​ నుంచి పోటీలో ఉన్న బండి సంజయ్, నిజామాబాద్​ నుంచి బరిలో ఉన్న ధర్మపురి అర్వింద్​మినహా మిగతావారెవరూ ప్రచారానికి ముందుకు రావడం లేదు. 

కేసులతో బీఆర్ఎస్​ఉక్కిరిబిక్కిరి  

అభ్యర్థులను ప్రకటించడం నుంచి ప్రచారాన్ని ప్రారంభించే వరకు ఇతర పార్టీల కంటే ముందుండే బీఆర్ఎస్.. ఈ సారి లోక్​సభ ఎన్నికలకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే సిట్టింగ్​ ఎమ్మెల్యే, ఎంపీలు కాంగ్రెస్​లో చేరడం.. మరికొందరు కూడా రెడీగా ఉండడంతో వారిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నది. ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్​ కేసులో కవిత అరెస్ట్, ఫోన్​ ట్యాపింగ్, ఇతరత్రా కేసులు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

ఫాంహౌస్​లో, అడపాదడపా తెలంగాణ భవన్​లో ఆయా నియోజవకర్గ లీడర్లతో మీటింగ్స్​మినహా బీఆర్ఎస్​ పార్టీ దూకుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏప్రిల్​ రెండో వారం నుంచి బీఆర్​ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ లోక్​సభ ఎన్నికల ప్రచారానికి బహిరంగ సభలను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. నామినేషన్లు వేసే టైం వరకు ఓ ఎంపీ అభ్యర్థి కూడా పార్టీ మారే అవకాశం ఉందనే చర్చ నడుస్తున్నది.