హైదరాబాద్, వెలుగు: ఓట్ల చోరీ, సీట్ల చోరీ.. ఇది కాంగ్రెస్ పార్టీ నైజమని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఓటుకు నోటు కేసుతో ఓట్ల దొంగతనాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇతర దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి ఓట్లు ఎగిరిపోతాయనే భయంతోనే ఈ ముఠా అంతా ఏకమై ఏడుస్తోందని ఎద్దేవా చేశారు.
సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు దొంగ ఆధార్ కార్డులతో ఓటర్లుగా నమోదయ్యారని ఆరోపించారు. ఒక్కో ఇంట్లో 200 దొంగ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో వేల సంఖ్యలో పాకిస్తానీయులు అక్రమంగా ఉంటున్నారని, వారికి ఓటు హక్కు ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు.
సర్‌పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతల మెదడు చోరీ అయిందని విమర్శించారు. 1951 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఈ ప్రక్రియ జరిగిందని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ఆయన ప్రశ్నించారు. సోనియా గాంధీకి భారత పౌరసత్వం రాకముందే ఓటరుగా నమోదు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును కాదని ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్నే చోరీ చేసిందన్నారు. గతంలో ఎన్నికల కమిషన్ అధికారులకు పదవుల ఎర వేసి వ్యవస్థలను మేనేజ్ చేసింది కూడా వారేనని ఆరోపించారు.
