ఇయ్యాల ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ భేటీ

ఇయ్యాల ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ భేటీ
  •      హాజరవనున్న సీఎం రేవంత్ రెడ్డి
  •     మిగిలిన 8 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఫైనల్ చేసే చాన్స్

న్యూఢిల్లీ/ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) బుధవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో సమావేశం కానుంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఇందులో తెలంగాణలో మిగిలిన ఎనిమిది స్థానాలతో పాటు, దేశ వ్యాప్తంగా పలు సీట్లకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. 

రాష్ట్రంలోని 17 సీట్లకు గాను.. ఫస్ట్ లిస్ట్ లో నాలుగు, సెకండ్ లిస్ట్ లో ఐదు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన ఎనిమిది స్థానాలు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మంకు అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంది. ఈ సెగ్మెంట్లపై ఏకాభిప్రాయం వస్తే అభ్యర్థులను ప్రకటించే చాన్స్ కూడా ఉన్నది. ప్రధానంగా ఖమ్మం, భువనగిరి సీట్ల అభ్యర్థుల విషయంలో సమస్యలు వస్తుండగా, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, మెదక్ లలో సరైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నది.