సింగరేణిలో కాంగ్రెస్ ​క్లీన్​స్వీప్..8 మంది సిట్టింగ్ ​ఎమ్మెల్యేలు ఔట్​

సింగరేణిలో కాంగ్రెస్ ​క్లీన్​స్వీప్..8 మంది సిట్టింగ్ ​ఎమ్మెల్యేలు ఔట్​
  •     ఏడు చోట్ల హస్తం, మరో చోట సీపీఐ గెలుపు 
  •     కోల్​బెల్ట్​ ఓటర్ల మద్దతు ‘చేతి’కే..

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : సింగరేణి బెల్ట్​లో కాంగ్రెస్​ క్లీన్​ స్వీప్​ చేసింది. బీఆర్ఎస్​ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.  నాలుగు జిల్లాల్లోని సింగరేణి బెల్ట్​లో 8 అసెంబ్లీ స్థానాలుండగా..7 చోట్ల కాంగ్రెస్, ఒక చోట కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకున్న  సీపీఐ గెలిచింది. ఈ ఏరియాల్లో 48 వేలకు పైగా సింగరేణి కార్మికులున్నారు. రిటైర్డ్​ అయిన కార్మిక కుటుంబాలు మరో 50 వేల వరకు ఉంటాయి. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా,  మెజారిటీ కాంగ్రెస్ ​పార్టీ వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్, సీపీఐ క్యాండిడేట్లను భారీ ఆధిక్యంతో గెలిపించారు.  

ప్రైవేటీకరణను అడ్డుకోవడానికే..

సింగరేణి ప్రైవేటీకరణ  యత్నాలను చేయకుండా అడ్డుకోవడం  కాంగ్రెస్, వామపక్షాల వల్లే సాధ్యమవుతుందన్న నమ్మకంతో కార్మికులు హస్తం పార్టీ  వైపు మొగ్గు చూపినట్టు చెప్తున్నారు.  ఇప్పటికే బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రంలో తాడిచెర్ల ఓపెన్​ కాస్ట్​ ప్రైవేట్​ పరం చేసి సింగరేణి కార్మికుల పొట్ట కొట్టింది. దీనిపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. అలాగే  సింగరేణి  లాభాలను సర్కారు ఫండ్స్​ లాగా వాడుకున్నది. సింగరేణి ప్రాంతంలో కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన  వేల కోట్ల నిధులను బయటి  ప్రాంతాలకు మళ్లించింది.   

సింగరేణిలో బీఆర్​ఎస్​ సర్కారు   జోక్యం బాగా  పెరిగిందన్న కోపం కార్మికుల్లో ఉంది.  గతంలో సింగరేణిలో ఎమ్మెల్యేల పైరవీలకు తావు ఉండేది కాదు. బీఆర్​ఎస్​ హయాంలో  వాళ్ల జోక్యం బాగా పెరిగింది.  మెడికల్​ ఇష్యూస్​లో బీఆర్​ఎస్​ లీడర్లు ఇన్​వాల్వ్​ కావడం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం తదితర అంశాలు బీఆర్​ఎస్​ పార్టీని దెబ్బతీశాయి.   

కలిసొచ్చిన ‘పొత్తు’ ..

సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్​ పూర్తిగా దెబ్బతినడానికి అనేక కారణాలున్నాయి. ఇక్కడ బలంగా ఉన్న వామపక్ష కార్మిక సంఘాల ప్రభావం బాగా పని చేసింది.  బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్​కు పూర్తి మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ ఆ పార్టీలను బేఖాతరు చేసింది. దీనికి తోడు లెఫ్ట్​ పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉండడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్​తో జత కట్టేందుకు సిద్ధపడ్డాయి.

ఇందులో భాగంగా సీపీఐ, కాంగ్రెస్​ మధ్య  పొత్తు కుదిరింది.  సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ సింగరేణిలో బలమైన యూనియన్​. దీని ప్రభావం కార్మికుల మీద బాగా పడింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు  వాయిదా పడ్డాయి.   బీఆర్​ఎస్​ అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్​ ఎన్నికలు జరగకుండా అడ్డుపడుతుందన్న అసంతృప్తి కార్మికుల్లో బలంగా ఉంది.  

8 సిట్టింగ్​ ఎమ్మెల్యే స్థానాలు ఖతం

2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో  బీఆర్​ఎస్​.. భూపాలపల్లి, ఇల్లందు, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్..రామగుండం సెగ్మెంట్​లో ఏఐబీఎఫ్​ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్​, ఏఐబీఎఫ్​ ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​లో   చేరారు. కానీ, ఈసారి  అన్ని చోట్ల   కాంగ్రెస్​ ప్రభంజనం వీచింది.   8 మంది  సిట్టింగ్ ​ఎమ్మెల్యేలు ఓడిపోయారు. 

సింగరేణి ఏరియాలో గెలిచిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు వీరే ...   

బెల్లంపల్లి          గడ్డం వినోద్​
చెన్నూర్            గడ్డం వివేక్​ 
మంచిర్యాల      ప్రేమ్​ సాగర్​రావు
రామగుండం     మక్కాన్​సింగ్​ రాజ్​ ఠాకూర్
భూపాలపల్లి       గండ్ర సత్యనారాయణరావు
ఇల్లందు             కోరం కనకయ్య
సత్తుపల్లి             మట్టా రాగమయి 
కొత్తగూడెం          కూనంనేని సాంబశివరావు