కాళేశ్వరంపై చర్చకు అసెంబ్లీని సమావేశపరచాలె

కాళేశ్వరంపై చర్చకు అసెంబ్లీని సమావేశపరచాలె

హైదరాబాద్: కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదని  కాగ్రెస్ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్ల రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ కాళేశ్వరంలో ధార పోశారన్న ఆయన... కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగంలేదన్నారు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న కేసీఆర్... కనీసం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, అందుకే ఇటీవల కురిసిన వర్షాలకు పంపులు, వాల్వ్ లు నీటమునిగాయి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపులు పని చేస్తున్నాయా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద ఏం జరుగుతుందో ప్రభుత్వం బయటకి రానీయడంలేదన్న భట్టి... కనీసం  అక్కడ పని చేసే వర్కర్ల ను  ఫోన్లు కూడా తీసుకుపోనీయడం లేదని ఫైర్ అయ్యారు. 

త్వరలోనే సీఎల్పీ బృందంతో కాళేశ్వరం విజిట్ చేస్తామని, అందరిని ఆపినట్లు తమని ఆపడానికి ప్రయత్నిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసిండని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని బయటకు చెప్పాలన్న ఆయన... దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని సవాలు విసిరారు