
హైదరాబాద్, వెలుగు: అదానీ వ్యవహారంపై జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ బుధవారం చేపట్టిన ‘చలో రాజ్‌భవన్’ ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. సేవ్ ఎల్ఐసీ ప్లకార్డులను ప్రదర్శిస్తూ, కేంద్రం, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు తీశారు. అయితే ర్యాలీని ఖైరతాబాద్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం లీడర్లు, కార్యకర్తలు రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి కింద పడ్డారు. పార్టీ లీడర్లందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, నదీమ్ జావెద్, చిన్నారెడ్డి, రోహిత్ చౌదరీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంగిశెట్టి జగదీశ్, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల అరెస్టును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు.
అదానీకి దోచిపెడుతున్నరు: భట్టి
కాంగ్రెస్ సృష్టించిన సంపదను అదానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టులకు ప్రధాని దోచి పెడుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎల్ఐసీ వంటి సంస్థలను దివాలా తీయిస్తున్న అదానీని అరెస్టు చేయకుండా మోడీ అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆర్థిక వ్యవస్థ ఆగమవుతున్నా మోడీ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. దేశ సంపదను దోచిపెడుతుండడంపై రాహుల్ ప్రశ్నిస్తే.. దేశాన్ని అవమానించారంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అదానీ ఆర్థిక నేరమే దేశంలో అతిపెద్ద కుంభకోణమన్నారు.
అవినీతిని ప్రశ్నిస్తే దేశ పరువు తీసినట్టా?: సీతక్క
అదానీ కుంభకోణంపై రాహుల్పార్లమెంట్లో మాట్లాడితే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మోడీ అవినీతిని ప్రశ్నిస్తే దేశ పరువు తీసినట్టవుతుందా? అని ప్రశ్నించారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు వెంటనే జేపీసీని నియమించాలని మల్లు రవి డిమాండ్ చేశారు.