ఇష్టం వచ్చినట్లు చేస్తే లెక్కలు తేలుస్తాం..హరీశ్, కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నరు: మల్లు రవి

ఇష్టం వచ్చినట్లు చేస్తే లెక్కలు తేలుస్తాం..హరీశ్, కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నరు: మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని కాంగ్రెస్​క్రమశిక్షణ కమిటీ చైర్మన్​మల్లు రవి అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు మన పథకాలను పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. ఓటమి తర్వాత హరీశ్​రావు, కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విధ్వంసం చేయాలని పిలుపునివ్వడం వారి ఫ్రస్ట్రేషన్‌‌కు నిదర్శనమని, స్వేచ్ఛ ఇచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.

ఆదివారం హైదరాబాద్​లోని గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. పాలకుర్తి, కామారెడ్డి నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, పార్టీ సీనియర్ నేతలు హరిప్రసాద్, కిశోర్‌‌ రెడ్డికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే అత్త ఝాన్సీరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ తమను పట్టించుకోవడం లేదని హరిప్రసాద్, కిశోర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ ఇద్దరిపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కంప్లైంట్​చేశారు.

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీరెడ్డి.. కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌‌ను అబ్జర్వర్‌‌గా నియమిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి నియోజకవర్గంలో మైనార్టీ నేత షబ్బీర్ అలీపై టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని షబ్బీర్ అలీ వర్గీయులు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి సొంత పార్టీని కాదని ఇతర పార్టీల నేతలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కమిటీ.. చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.