పల్లెల్లో హస్తం జైత్రయాత్ర..సగానికి పైగా స్థానాలు క్లీన్ స్వీప్

పల్లెల్లో హస్తం జైత్రయాత్ర..సగానికి పైగా స్థానాలు క్లీన్ స్వీప్
  • రెండు విడతల్లోనూకాంగ్రెస్ పార్టీదే జోరు
  • మొత్తం 61.24% సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్​ కైవసం
  • మొదటి విడతలో 67%,రెండో విడతలో 55% సీట్లు 
  • పది జిల్లాల్లో ‘డబుల్ సెంచరీ’ పైనే!
  • రెండో స్థానానికిపరిమితమైన బీఆర్ఎస్..
  • పుంజుకున్న బీజేపీ, ఇతరులు

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయంతో జోరుమీదున్న కాంగ్రెస్.. పంచాయతీ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదటి, రెండు విడతల్లోనూ మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయబావూటా ఎగరవేశారు. సర్పంచ్ స్థానాల్లో దాదాపు 10 జిల్లాల్లో ‘డబుల్ సెంచరీ’ దాటించారు. రెండు విడతలు కలిపి మొత్తం 8,566 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. అందులో 5,246 స్థానాలను (61.24%) గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ తన సత్తా చాటింది. 

బీఆర్ఎస్ 2,329 స్థానాలతో (27.19%)  రెండో స్థానంలో నిలవగా.. బీజేపీ 500 స్థానాలతో (5.84%) సరిపెట్టుకున్నది. ఇక స్వతంత్రులు, ఇతరులు 467 స్థానాల్లో విజయం సాధించారు. మొదటి విడతలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించగా.. రెండో విడతలోనూ ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రతి రౌండ్​లోనూ కాంగ్రెస్ పైచేయి సాధించడంతో కార్యకర్తల్లో జోష్ నిండింది.

మొదటి విడతలో 67.65%  స్థానాల్లో విజయం..

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4,235 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థలు 2,865 స్థానాలను కైవసం చేసుకున్నారు.  అంటే.. 67.65 శాతం పంచాయతీల్లో పాగావేశారు. చాలా జిల్లాల్లో 70 శాతానికిపైగా సీట్లు సాధించారు. నల్గొండ జిల్లాలో మొత్తం 318 స్థానాలకు గానూ 231 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. 

వికారాబాద్ జిల్లాలో 262 స్థానాలకు 189 సీట్లు, నిజామాబాద్ జిల్లాలో 184 సీట్లకు గానూ 153 స్థానాలు, ఖమ్మం జిల్లాలో 192 స్థానాలకు 145, ఆదిలాబాద్ జిల్లాలో 166 స్థానాలకూ 120 చోట్ల కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఇక శాతాలవారీగా చూస్తే.. నిజామాబాద్ జిల్లాలో 83.15% (184 స్థానాల్లో 153), ఖమ్మం జిల్లాలో 75.52% (192 స్థానాలకు 145 గెలుపు), మెదక్ జిల్లా 73.12% (160 సీట్లలో 117 గెలుపు), నల్గొండ జిల్లాలో 72.64% (318 సీట్లలో 231 గెలుపు), ఆదిలాబాద్ జిల్లాలో 72.28% (166 సీట్లలో 120 గెలుపు) శాతంతో దూసుకెళ్లాయి.

బీఆర్ఎస్ కు 26.99 శాతమే.. 

మొదటి విడతలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కేవలం 1,143 స్థానాలకే (26.99%) పరిమితమయ్యారు. మెజారిటీ జిల్లాల్లో ఆ పార్టీ ప్రభావం నామమాత్రంగానే ఉంది.  సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ కొంత పోటీనిచ్చింది. స్థానాల పరంగా చూస్తే.. నల్గొండ జిల్లాలో 318 స్థానాలకు  కేవలం 82,  వికారాబాద్ 262 స్థానాలకు 71 సీట్లు, సిద్దిపేటలో 163 స్థానాలకు  69 చోట్ల గెలిచింది. ఈ జిల్లాలో బీఆర్ఎస్ 42.33% తో మిగతా జిల్లాల కంటే ఎక్కువ చోట్ల గెలిచింది. రంగారెడ్డిలో 174 స్థానాలకు 67 (38.5%), మహబూబ్​నగర్139 స్థానాలకు 54 (38.8%) సీట్లు కైవసం చేసుకున్నది.

రెండో విడతలోనూ కాంగ్రెస్​దే ఆధిపత్యం

రెండో విడతలోనూ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించింది. నిజామాబాద్, నల్గొండ, వరంగల్ రూరల్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల జోరు కనిపించింది. రెండో విడతలో 4,331 స్థానాలకు గాను 2,381 (54.98%) గెలుచుకున్నది. బీఆర్ఎస్ 1,186  (27.38%) స్థానాలు, బీజేపీ 315 (7.27%) స్థానాలు, ఇతరుల 424 (9.79%) స్థానాలు  కైవసం చేసుకున్నారు. 

రెండో విడతలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. నల్గొండ జిల్లాలో 281 స్థానాలకు 180, సంగారెడ్డి జిల్లాలో 243 స్థానాలకు గాను 146, కామారెడ్డి జిల్లాలో 197 స్థానాలకు గాను 129, నిజామాబాద్ జిల్లాలో196 స్థానాలకు 121, ఖమ్మం జిల్లాలో183 స్థానాలకు 117 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది.

రెండో విడతలో బీఆర్ఎస్​కు 27.38%

బీఆర్ఎస్ రెండో విడతలో 1,186 గెలువగా.. 27.38% శాతం నమోదైంది.  సిద్దిపేట జిల్లాలో 186 స్థానాలకు గాను 116, సంగారెడ్డి 243 స్థానాలకు 84, నల్గొండలో 281 స్థానాలకు 65 చోట్ల విజయం సాధించింది. జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో రెండో విడతలో ఆ పార్టీకి  కొంచెం మెరుగైన ఫలితాలొచ్చాయి. 

రెండో విడతలో బీజేపీ కాస్త పుంజుకున్నది. నిర్మల్ జిల్లాలో 131స్థానాలకు 56, ఆదిలాబాద్ 156 స్థానాలకు 43, నిజామాబాద్ జిల్లాల్లోనూ  బీజేపీ ప్రభావం చూపింది.  మొదటి విడత నిర్మల్‌‌‌‌ జిల్లాలో136 స్థానాలకు 18 సీట్లు గెలుచుకోగా.. రెండో విడతలో 131 స్థానాలకు 56 చోట్ల విజయం సాధించింది. అంటే.. మొదటి విడత కంటే రెండో విడతలో 38 స్థానాల ఎక్కువ గెలుచుకోవడం విశేషం. 

రెండో విడతలో స్వతంత్రుల జోరు కనిపించింది. వికారాబాద్ 46, నల్గొండ 36, నిర్మల్ జిల్లాలో 34 చోట్ల ఇతరులు గెలుచుకున్నారు. పార్టీల నుంచి మద్దతు కోరి టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తులు రెబల్స్‌‌‌‌గా పోటీచేయడంతో  రెండో విడతలో కాంగ్రెస్, బీఆర్ఎస్​పై ప్రభావం చూపించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలతో పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ మరింత పట్టును సాధించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ హస్తం పార్టీ ఏకపక్ష విజయాలను నమోదు చేయడం విశేషం. 

మొదటి, రెండు విడతల్లో ఫలితాలు ఇలా.. 

మొత్తం

పంచాయతీలు    8,566
కాంగ్రెస్    5,246 (61.24%)
బీఆర్ఎస్    2,329 (27.19%)
బీజేపీ    500 (5.84%)
ఇతరులు    467 (5.45%)