
- సీఈసీ రాజీవ్ కుమార్‌కు కాంగ్రెస్ లేఖ
- రాష్ట్రపతి ముర్ము, సీఈసీ రాజీవ్ కుమార్‌కు కాంగ్రెస్ లేఖ
- బ్యారేజీల మరమ్మతులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్రపతి, సీఈసీల ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు శుక్రవారం పార్టీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని కట్టారని తెలిపారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగడంతో పాటు అన్నారం బ్యారేజీకి బుంగ పడిందన్నారు.
‘‘కాళేశ్వరంలోని 3 బ్యారేజీల భద్రత, మరమ్మతులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయించాలి. నీళ్లు విడుదల చేస్తే కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలపై అంచనా వేయించాలి. ప్రాజెక్టు కోసం కేంద్ర రుణ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.80 వేల కోట్ల అప్పులు చేసినందున.. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి. కాళేశ్వరం కార్పొరేషన్‌కు కేటాయించిన అక్రమ రుణాలపై ఆర్బీఐ, కేంద్ర విద్యుత్ శాఖతో దర్యాప్తు చేయించాలి. కాళేశ్వరం కార్పొరేషన్, దాని కార్యకలాపాలపై ఆడిట్ జరిపించాలి.
ఈ ప్రాజెక్టు వరదతో దాని కింద పరివాహక ప్రాంతాల్లోని ప్రజల భద్రతను సమీక్షించేలా కేంద్ర హోం శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి సూచనలు చేయాలి. బ్యారేజీ కుంగడానికి కారణమైన ప్రభుత్వం, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఆదేశాలివ్వాలి’’అని లేఖలో రాష్ట్రపతి, సీఈసీని నిరంజన్ కోరారు.