ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి

ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి
  •      ఆత్రం సుగుణను గెలిపించాలి
  •     టీజేఎస్ చీఫ్ కోదండరామ్​ను కోరిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు :  ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలని జిల్లా ఇన్​చార్జ్ మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ లోక్​సభ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం టీజేఎస్ నేతలు కృషి చేయాలని కోరారు. శుక్రవారం మంత్రి సీతక్కను హైదరాబాద్​లోని ఆమె నివాసంలో టీజేఎస్ చీఫ్ కోదండరామ్, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జ్ వినోద్ కుమార్, టీజేఎస్ నేతలు రతన్ రావు, నరహరి గౌడ్, కాంగ్రెస్ నేతలు ఇందిర శోభన్, సామ రామ్మోహన్ రెడ్డి కలిశారు. 

గత ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి అభ్యర్థిని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని నేతలను మంత్రి సీతక్క కోరారు. ఆదిలాబాద్​లో బీజేపీ అభ్యర్థిని మార్చిందని, అయినా.. ఆ పార్టీని ఓడించాలన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిందని గుర్తు చేశారు. టీజేఎస్ నేతలందరూ లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములయ్యేలా చూడాలని కోదండరామ్​ను మంత్రి సీతక్క కోరారు.