- గతేడాది 3979 కేసులు, ఈ ఏడాది 6486
- చీటింగ్, దొంగతనం కేసులే అధికం
- ఆసిఫాబాద్‌లో 60 శాతం పెరిగిన కేసులు
- క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేసిన ఎస్పీలు
ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో కేసుల సంఖ్య గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. 2024లో కేసులు 3979 నమోదు కాగా, ఈ ఏడాది ఏకంగా 6486 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎస్పీ అఖిల్ మహాజన్ నేరాల వార్షిక నివేదికను మీడియా సమావేశంలో వెల్లడించారు. దొంగతనాలు, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ప్రెస్మీట్లో ఎస్పీ మాట్లాడుతూ నేరాల కట్టడికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు.
మహిళలు, చిన్నారుల రక్షణకు షీటీంను పటిష్టం చేశామన్నారు. ఆపరేషన్ జ్వాల, పోలీస్ అక్క ద్వారా మహిళలు, విద్యార్థినులకు చేరువయ్యామని, జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు స్కూల్, కాలేజీ విద్యార్థులతో యాంటి డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు హాట్స్పాట్లు, బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ రంబల్స్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి, ఇంజనీరింగ్ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. రోడ్ సేఫ్టీ క్లబ్ ద్వారా ప్రమాదాలను నివారించేందుకు అవగాహన కల్పించామన్నారు. మారుమూల ఆదివాసీ గిరిజన ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
కొన్ని ముఖ్యమైన కేసులు
ఈ ఏడాది 381 రోడ్డు ప్రమాదాల్లో 117 మంది మృత్యువాత పడ్డారు. 20 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. పోగొట్టుకున్న 718 ఫోన్లను సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసి తిరిగి అందజేశారు. ఈ ఏడాది 132 సైబర్ కేసులు నమోదయ్యాయి. 174 గంజాయి కేసులు నమోదు. 46 కేజీల డ్రై గాంజ, 2256 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని 308 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రూ.2.34 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
29 కేసుల్లో 1280 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని 47 మందిని అరెస్ట్ చేశారు. 197 పేకాట కేసులు నమోదు చేసి రూ.17,12,163 నగదు స్వాధీనం చేసుకున్నారు. 1085 మందిని అరెస్టు చేశారు. 242 చోరీ కేసుల్లో 371 మందిని అరెస్టు చేసి రూ.47.18 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
గతేడాదితో పోలిస్తే ఆసిఫాబాద్ జిల్లాలో నేరాలు 60.23 శాతం పెరిగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితికా పంత్ 2025 జిల్లా క్రైమ్ రిపోర్ట్ రివరాలు తెలియజేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో మెరుగైన పోలీసీంగ్ నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించగలిగారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యం చేయడంలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
ప్రజల సహకారంతోనే నేరాలను నియంత్రించగలిగామని ఎస్పీ తెలిపారు. చట్టాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నేరాల నివారణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో కాగజనగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
పెరిగిన క్రైమ్ రేట్
జిల్లాలో 2024లో 1207 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో 1934 కేసులు నమోదయ్యాయి. చోరీ కేసులు మూడింతలు పెరిగి 151గా, ఐపీసీ కేసులు డబుల్ అయ్యి 1095గా నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు గతేడాది 18 నమోదు కాగా ఈ ఏడాది 24కు పెరిగాయి. రేప్ కేసులు సంఖ్య తగ్గింది. గత ఏడాది 24 నమోదు కాగా ఈ ఏడాది 22 కేసులు నమోదు అయ్యాయి. చీటింగ్ కేసులు 170 నుంచి 197లకు పెరిగాయి. సైబర్ నేరాలపై 315 పిటిషన్లు వచ్చాయి.
సైబర్ నేరగాళ్లు రూ. 2.07కోట్లు కాజేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.17.81 లక్షల ట్రాన్స్‌సాక్షన్స్ నిలిపివేసి, రూ.4,78,341 బాధితులకు చెల్లించారు. 20 మంది నిందితులను అరెస్ట్‌చేశారు. ఈ ఏడాది 267 రోడ్డు ప్రమాదాలు నమోద య్యాయి. ఇవికాక(బీఎన్ఎస్) కేసులు 1095 నమోదయ్యాయి. 73 గంజాయి కేసులు నమోదు కాగా 122 మందిని అరెస్టు చేశారు.15.224 కిలోల డ్రై గంజాయి పట్టుకుని 1,118 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1934 కేసులు నమోదు కాగా వీటిలో 1294 కేసులు పరిష్కరిం చారు. 640 కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ముఖ్యమైన కేసులు
కేసులు 2024 2025
రోడ్డు ప్రమాదాలు 349 381
డే హౌజ్ బ్రేకింగ్ 24 47
నైట్ హౌజ్ బ్రేకింగ్ 132 192
చీటింగ్ 192 655
గంజాయి 77 174
మిస్సింగ్ 342 405
కిడ్నాప్ 41 58
రేప్ 48 55
హత్యలు 14 13
హత్యయత్నం 48 31
అగ్ని ప్రమాదం 01 13
రాబరీ 07 11
ఆసిఫాబాద్ జిల్లాలో..
నేరాలు 2024 2025
దొంగతనాలు 50 151
మర్డర్ 12 10
కిడ్నాప్ 18 24
రేప్ లు 24 22
బలమైన గాయలు 16 26
సాధారణ గాయలు 176 171
చీటింగ్ 170 197
హత్యాయత్నం 32 31
