గ్రామీణ క్రికెటర్లు సత్తా చాటాలి.. ఇందుకు గొప్ప వేదిక కాకా టోర్నీ: మంత్రి వివేక్

గ్రామీణ క్రికెటర్లు సత్తా చాటాలి.. ఇందుకు గొప్ప వేదిక కాకా టోర్నీ: మంత్రి వివేక్
  • ఈ టోర్నీలో ఐదుగురు బెస్ట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి, ట్రైనింగ్​ ఇప్పిస్తం
  • ఇండియా టీమ్‌‌కు ఆడేలా వారిని తీర్చిదిద్దుతాం
  • హెచ్‌‌సీఏ చాన్స్​ ఇస్తే ‘విశాక’ ఏటా టోర్నీకి స్పాన్సర్‌‌‌‌ చేస్తుందని వెల్లడి
  •     ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో కాకా వెంకటస్వామి పాత్ర 
  • కీలకం: మండలి చైర్మన్ 
  • గుత్తా సుఖేందర్ రెడ్డి 
  •     మంత్రి వివేక్​కు  
  • క్రీడా శాఖ ఇచ్చి ఉంటే మరిన్ని ఆటలకు మేలు జరిగేదని వ్యాఖ్య
  •     ఉప్పల్ స్టేడియంలో కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ రెండో దశ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. ఇందుకు విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ‘కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్’ అద్భుత వేదికగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. కాకా టోర్నీ రెండో దశ పోటీలను సోమవారం ఉప్పల్ స్టేడియంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. విజేతలకు అందించే ట్రోఫీని ఆవిష్కరించారు. 

అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తొలి దశలో సత్తా చాటి రెండో దశకు ఎంపికైన క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చే క్రీడాకారులను టర్ఫ్‌‌‌‌‌‌‌‌ వికెట్లపై ఆడించి, వారిని జాతీయ స్థాయికి సిద్ధం చేయడమే ఈ టోర్నీ లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘గతంలో నేను హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు తెలంగాణ టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తే.. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ప్రతిభ దాగుందో నిరూపించింది. క్రికెటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ జిల్లాల్లో ఈ టోర్నీ నిర్వహిస్తున్నాం. పల్లెల్లోని ప్రతిభావంతులు మంచి క్రికెటర్లుగా ఎదగడానికి ఇదో గొప్ప అవకాశం’’ అని ఆయన తెలిపారు. 

ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆడేలా తీర్చిదిద్దుతాం

ఇకపై స్టేట్ టీమ్స్‌‌‌‌‌‌‌‌లో ప్రతి జిల్లా నుంచి కనీసం ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసేలా హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ఒక నిబంధన పెట్టుకోవాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి సూచించారు. దీనిపై ఏజీఎంలో నిర్ణయం తీసుకోవాలని హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్ సభ్యులను కోరారు. రూరల్ క్రికెటర్లకు అవకాశం లభిస్తేనే మరింత మంది వెలుగులోకి వస్తారని తెలిపారు. 

‘‘గ్రామీణ క్రికెటర్లకు ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడే అవకాశాన్ని విశాక ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ కల్పించాయి. వీరి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వీరంతా మున్ముందు స్టేట్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌కు, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కు ఆడే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఐదుగురు బెస్ట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి, వారికి ప్రత్యేక తర్ఫీదు ఇప్పించి ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆడేలా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉంది. హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ అవకాశం ఇస్తే విశాక ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ ప్రతి ఏటా ఈ టోర్నీకి స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంది’’ అని ఆయన ప్రకటించారు.

జిల్లాకో స్టేడియం ఉండాలి

కాకా వెంకటస్వామి స్ఫూర్తితోనే విశాక ఇండస్ట్రీ క్రీడలను ప్రోత్సహిస్తున్నదని ఆ సంస్థ చైర్మన్ కూడా అయిన మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘‘ఈ రోజు మన కండ్లముందున్న ఈ భారీ స్టేడియం నాడు కాకా వెంకటస్వామి తీసుకున్న చొరవకు నిదర్శనం. నాడు విశాక బోర్డు సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆయన పట్టుబట్టబట్టే ఇంత గొప్ప స్టేడియం మనకు దక్కింది’’ అని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణలో ప్రతి జిల్లాకో క్రికెట్ స్టేడియం ఉండాలని, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 8 స్టేడియాలు ఉన్నట్లు ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలని అన్నారు. ఫ్యూచర్​ సిటీలో హెచ్‌‌‌‌‌‌‌‌సీఏకు ప్రభుత్వం వంద ఎకరాల భూమి కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, అక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మరో స్టేడియం రాబోతున్నదని వెల్లడించారు.

మహిళా క్రికెటర్లను ప్రోత్సహించాలి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో దివంగత కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. కాకా స్ఫూర్తితో విశాక ఇండస్ట్రీస్ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ‘‘మంత్రి వివేక్ విశాల హృదయంతో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు స్పాన్సర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఆయనకు క్రీడా శాఖ ఇచ్చి ఉంటే మరిన్ని ఆటలకు మేలు జరిగేది. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించే బాధ్యత కూడా ఆయన తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు. 

దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్.. త్వరలోనే మహిళల కోసం ప్రత్యేకంగా లీగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్ సింగ్‌‌‌‌‌‌‌‌, సంయుక్త కార్యదర్శి బసవరాజు, ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, జిల్లా క్రికెట్ సంఘాల కార్యదర్శులు, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ సభ్యులు పాల్గొన్నారు.