- ప్రారంభమైన అసెంబ్లీ
- శీతాకాల సమావేశాలు
- రాంరెడ్డి దామోదర్ రెడ్డి,
- కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానాలు
- సంతాప తీర్మానం ప్రవేశపెడ్తుండగానే
- వెళ్లిపోయిన ప్రతిపక్ష నేత
- జీరో అవర్‌లో సమస్యలను
- ప్రస్తావించిన ఎమ్మెల్యేలు
- జనవరి 2 నుంచి 4 వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీలో ప్రాథమిక నిర్ణయం
- 9 నెలల తర్వాత
- అసెంబ్లీకి కేసీఆర్ రాక.. మూడు నిమిషాలే సభలో!
- సీటు దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా
- పలుకరించిన సీఎం రేవంత్.. ఆరోగ్యం గురించి వాకబు
- లేచి నిలబడి విష్ చేసిన కేసీఆర్.. సీట్లోనే కూర్చున్న కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి
- అవసరమైతే మరిన్ని రోజులు పొడిగిస్తామన్న ప్రభుత్వం
- 15 రోజులు సమావేశాలు జరపాలని పట్టుబట్టాం: హరీశ్‌రావు
- 32 అంశాలపై చర్చించాలని కోరాం: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చారు. మూడు నిమిషాల పాటే ఉన్నారు. ఆయనను సీటు దగ్గరికి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. నేరుగా ప్రతిపక్ష సభ్యుల సీట్లవైపు వెళ్లి కేసీఆర్‌కు గౌరవంగా నమస్కరించి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ‘ఆరోగ్యం బాగుందా’ అని వాకబు చేయగా.. ‘బాగుంది’ అంటూ కేసీఆర్ రిప్లై ఇచ్చారు.
ప్రతిపక్ష నాయకుడి వైపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లగానే.. అటువైపు ఉన్న బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ సహా సభ్యులంతా సీఎంకు గౌరవ సూచకంగా లేచి నిలబడగా.. కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి మాత్రం కూర్చునే ఉండిపోయారు. కేసీఆర్ కూడా తన సీటులోంచి లేచి.. సీఎం రేవంత్‌ను పలుకరించారు. ఆపై మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, అధికార పార్టీ విప్‌లు కూడా వెళ్లి కేసీఆర్‌ను పలకరించారు. కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్‌ను పలకరించి, ఆశీర్వాదం తీసుకున్నారు.
మర్యాదపూర్వకంగా కలిశాను: సీఎం రేవంత్
కేసీఆర్‌ను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శాసనమండలి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత అసెంబ్లీ లాబీలో సీఎం మీడియాతో చిట్చాట్చేశారు. కేసీఆర్‌ను కలవడంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘ప్రతి సభ్యుడ్ని మేం గౌరవిస్తాం. కేసీఆర్‌ను ఇవాళే కాదు.. ఆస్పత్రిలో కూడా కలిశా’’ అని గుర్తుచేశారు. అసెంబ్లీ నుంచి వెంటనే ఎందుకు వెళ్లారో ఆయన్నే అడగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం బదులిచ్చారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘మేమిద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం?’’ అంటూ సీఎం చమత్కరించారు.
2 నుంచి 4వరకు అసెంబ్లీ..!
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. శాసన సభ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సోమవారం బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్చాంబర్లో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
బీఆర్ఎస్నుంచి హరీశ్‌రావు, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత జనవరి 2 నుంచి 4 వరకు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత అవసరమైతే మరోసారి బీఏసీ నిర్వహించి.. సభ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
15 రోజులు సమావేశాలు జరపాలి: హరీశ్‌రావు
బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని పట్టుపట్టామని వివరించారు. వారం రోజులు జరిపి మళ్లీ బీఏసీ పెడతామన్న స్పీకర్ చెప్పారని పేర్కొన్నారు. అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్అన్నారని ఆయన తెలిపారు. ‘‘గతంలో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వనందుకు బహిష్కరించామని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వకపోతే మేమూ బాయ్‌కాట్ చేయాలా అని అడిగాం” అని పేర్కొన్నారు.
32 అంశాలపై చర్చించాలని కోరాం: ఏలేటి
బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ శాసనసభ సమావేశాలు కనీసం 20 రోజులైనా నిర్వహించాలని కోరామన్నారు. 32 అంశాలపై చర్చించాలని కోరినట్లుగా వివరించారు. జనవరి 2 నుంచి 7 వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. 2 రోజులు సమావేశాలు పెట్టి చేతులు దులుపుకోవటం సరికాదని తెలిపారు. ‘‘రాష్ట్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. వాటిపై చర్చించే ధైర్యం లేనటువంటి ప్రభుత్వం.. మళ్లీ యథావిధిగా మూడు నాలుగు రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగించే విధంగా మాట్లాడుతున్నది.
కాళేశ్వరం, అనేక అంశాలపై దర్యాప్తు చేయించి బాధ్యులను జైల్లో పెడతానని హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్నారు. ఎన్నికల ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుమీద అనేక హామీలు ఇచ్చారు. వాటిపై చర్చించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా..? ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించేందుకు సమయం కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంతో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నది. అసెంబ్లీలో అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ ఉన్నది మూడు నిమిషాలే..!
అధికారం కోల్పోయి ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత మూడోసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆపై శాసన సభ ప్రారంభం తర్వాత జాతీయ గీతం ఆలాపన దాకా ఉన్నారు. అనంతరం..దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ చదువుతుండగానే అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.
సభ ప్రారంభమైన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే కేసీఆర్సభలో ఉన్నారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన అనంతరం సభ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్, నేరుగా నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కాగా, తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు సంతాప తీర్మానాలు, ఏడు ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లుల ప్రవేశపెట్టడం, జీరో అవర్‌లో పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించడంతో జనవరి 2కు వాయిదా పడ్డాయి.
