13 సీట్లపై కాంగ్రెస్ ఫ్లాష్ సర్వే

13 సీట్లపై కాంగ్రెస్ ఫ్లాష్ సర్వే
  •     రంగంలోకి సునీల్ కనుగోలు టీమ్
  •     ఈ నెల 11న మరోసారి సీఈసీ మీటింగ్
  •     బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించని 13  లోక్ సభ నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్​ స్ర్టాటజిస్ట్ సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో శని, ఆదివారాలు ఈ సర్వే చేసి సోమవారం ఏఐసీసీకి రిపోర్ట్ ఇవ్వనున్నట్లు  పార్టీ నేతలు చెబుతున్నారు. ఖమ్మం, నాగర్ కర్నూల్​, భువనగిరి టికెట్ కోసం మంత్రుల కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ ఎవరికి ఇస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉందని నేతలు అంటున్నారు. ఈ నెల 7న లోక్ సభ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ సీఈసీ మీటింగ్ జరగ్గా, ఈ నెల 8న ఏఐసీసీ 39 మందితో ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది.

 అయితే, ఈ జాబితాలో తెలంగాణలో 9 నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తారని అందరూ భావించినప్పటికి కేవలం నలుగురు అభ్యర్ధుల పేర్లనే ఏఐసీసీ ప్రకటించింది. ఈ నెల 11న మరోసారి సీఈసీ మీటింగ్ జరగనున్నది. ఈ మీటింగ్ కు ముందే ఏఐసీసీ నేతలకు సునీల్ కనుగోలు ఫ్లాష్ సర్వే రిపోర్ట్ ఇవ్వనున్నారని తెలుస్తున్నది. 11న జరిగే మీటింగ్ తర్వాత మరి కొంతమంది అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రకటించనుందని నేతలు భావిస్తున్నారు. తొలి జాబితాలో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారి పేర్లనే ప్రకటించి విమర్శలు రాకుండా కాంగ్రెస్ హైకమాండ్ మంచి నిర్ణయం తీసుకుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

 ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వారి పేర్లను ప్రకటిస్తే విమర్శలు వస్తాయనే వారి పేర్లను హైకమాండ్ ఆపిందని అంటున్నారు. మరో వైపు లెఫ్ట్ పార్టీల పొత్తు, వారు కూడా తమకు సీట్లు ఇవ్వాలని అడుగుతున్నందున ఆపినట్లు తెలుస్తున్నది. సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్​గిరి, చేవెళ్ల సీట్లలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన బొంతు రామ్మోహన్, నీలం మధు ముదిరాజ్ (బీఎస్పీ నుంచి వచ్చారు), కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. వీళ్లకి టికెట్లు ఇస్తే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా గత  పదేండ్ల నుంచి పనిచేసిన తమ పరిస్ధితి ఏంటని పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ లో  చర్చ జరుగుతున్నది. 

బీఆర్ఎస్ నుంచి ఇటీవలే చేరిన వారికి టికెట్లు ఇస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు నిరాశకు లోనవుతారని నేతలు అన్నట్లు పార్టీ నేతల్లో చర్చ నడుస్తున్నది. సికింద్రాబాద్ సీటును బొంతు రామ్మోహన్ కు ఇవ్వొద్దని పలువురు సీనియర్లు ఏఐసీసీ నేతలకు చెప్పినట్లు తెలుస్తున్నది.   బీఆర్ఎస్ లో  కేటీఆర్​కు రామ్మోహన్​ అత్యంత సన్నిహితుడిగా , బినామీగా వ్యవహరించారని.. ఆయనకు టికెట్ ఇస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలు చెప్పినట్లు సమాచారం. 

 ఈ నేపథ్యంలో ఈ సీట్లతో పాటు అభ్యర్ధులు ప్రకటించని 13 సీట్లలో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు, వారి వివరాలు, ఆర్థిక బలం, వీరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నియోజక ఇన్​చార్జీలు, ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని హైకమాండ్ కు సునీల్​ కనుగోలు రిపోర్ట్ ఇవ్వనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.