హైదరాబాద్ సిటీ మొత్తం.. కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలే

హైదరాబాద్ సిటీ మొత్తం.. కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలే

హైదరాబాద్, వెలుగు : ఇన్నాళ్లూ హైదరాబాద్ సిటీలో ఎటు చూసినా పింక్ ఫ్లెక్సీలే కనిపించేవి. వేరే పార్టీలకు అవకాశమే ఇచ్చేటోళ్లు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సిటీలో ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కార్యకర్తలు, నేతల్లో ఫుల్ జోష్​కనిపిస్తున్నది.

ఇటు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో.. సిటీ మొత్తం అందంగా ముస్తాబు చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ.. నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రధాన సర్కిళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

గాంధీ భవన్ వద్ద 30 మంది పోలీసులతో భద్రత

కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇటు పార్టీ ఆఫీసు గాంధీభవన్ వద్ద కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల మోహరింపును పెంచారు. ఎస్సై, సీఐ స్థాయి అధికారులతో పాటు ముప్పై మంది దాకా పోలీసులను అక్కడ బందోబస్తు కోసం ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులను కూడా మోహరించారు. పార్టీ ఆఫీసుకున్న రెండు ప్రధాన గేట్ల వద్ద కొత్తగా మెటల్ డిటెక్టర్లు పెట్టారు. ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తెరవకుండా మెటల్ డిటెక్టర్ పెట్టిన చోట మాత్రమే ఓపెన్ చేసి పెడ్తున్నారు. గాంధీభవన్ బిల్డింగ్​ను లైటింగ్స్​తో ముస్తాబు చేశారు.