- ఎన్నికలున్న ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు కో ఆర్డినేటర్లు
- కొడంగల్ బాధ్యతలు సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 43 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో పార్టీ ఎమ్మెల్యేలకు కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట్ల పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలను నియమించారు. వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని 34 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇదే పద్ధతిలో కో ఆర్డినేటర్లను నియమించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్కు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డిని కో ఆర్డినేటర్గా నియమించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కూడా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.
