కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసింది: హరీష్ రావు

 కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసింది: హరీష్ రావు

కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసిందని మంత్రి హరీష్ రావు అన్నారు.  అరచేతిలో కాంగ్రెస్ నేతలు వైకుంఠం చూపించారని.. ఆరు నెలల క్రితం చేసిన చిన్న తప్పుకు కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారని ఆయన చెప్పారు. కర్ణాటకలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఆచూకీ లేదని.. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ కర్ణాటకకు రాం రాం చెప్పారని.. ప్రియాంక గాంధీ అయితే పత్తలేరని ఎద్దేవా చేశారు.  కర్నాటకలో ఉన్న పథకాలకే కాంగ్రెస్ నేతలు కోత పెడుతున్నారని ఆయన చెప్పారు. 

2023, నవంబర్ 17వ తేదీ శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.  కర్ణాటకలో రోడ్లు వేయడానికే డబ్బుల లేవని డీకే శివకుమార్ అన్నారని...  ఖజానాలో డబ్బులు లేవని కర్ణాటకలో సీఎం చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో 300మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.  రకరకాల కండిషన్ లతో కర్ణాటకలో కోత పెట్టి జనాలను ముంచారని విమర్శించారు.  కర్ణాటకలో 5 గ్యారంటీలతో మోసం చేసి.. ఇక్కడ 6 గ్యారంటీలతో మోసం చేసేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.

పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్ 80 వేల నుంచి 11 వేల కు తగ్గించారని.. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల స్కాలర్ షిప్ లో కూడా కోత పెట్టారని తెలిపారు.  కాంగ్రెస్ హాయాంలో కర్ణాటక దివాలా తీసిందని.. తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. వెలుగుల తెలంగాణ కావాలో... దివాలా కర్ణాటక  కావాలో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు బెంగుళూరు వదిలి నియోజకవర్గాలకు వెళ్ళే పరిష్టితి లేదన్నారు. 

మళ్ళీ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు జరగాలా? అని అన్నారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ ఆత్యహత్య లు జరిగింది మన తెలంగాణలోనే అని చెప్పారు. కర్ణాటకలో అధికారం వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి..  6 నెలలు అయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజలు మేల్కొని చైతన్యం ప్రదర్శించాలన్నారు.  వెన్నుపోటు కాంగ్రెస్ ను నమ్ముకుంటే గుండెపోటు రాక తప్పదని హరీష్ రావు అన్నారు.